కాపీ అన్నందుకు హర్టయ్యాడు

కాపీ అన్నందుకు హర్టయ్యాడు

టాలీవుడ్లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి ఇంద్రగంటి మోహన కృష్ణ. ‘గ్రహణం’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత అదే తరహాలో కొత్త తరహా సినిమాలే చేశాడు. ప్రస్తుతం అతను ‘సమ్మోహనం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక సినీ నటి.. ఒక సామాన్య వ్యక్తితో ప్రేమలో పడే కథతో తెరకెక్కిందీ చిత్రం. ఐతే హాలీవుడ్లో ఇదే కథాంశంతో తెరకెక్కిన ‘నాటింగ్ హిట్’ అనే సినిమాతో దీన్ని పోలుస్తున్నారు. దాన్ని కాపీ కొట్టి ఇంద్రగంటి ఈ చిత్రం తీశాడని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. దీనిపై ఇంద్రగంటి స్పందించాడు. ఈ ప్రచారం ఆయన్ని బాగా బాధపెట్టినట్లుగానే ఉంది స్పందన చూస్తే.

ఒక సినీ నటి సామాన్యుడితో ప్రేమలో పడటం అనే కాన్సెప్టుని ‘నాటింగ్ హిల్’ సినిమాతోనే మొదలు కాలేదని అంటున్నాడు ఇంద్రగంటి. తనను ‘నాటింగ్ హిల్’తో పాటు మరెన్నో సినిమాలు ప్రభావితం చేసి ఉండొచ్చని.. నిజంగా తనపై ఆ ప్రభావం ఉంటే అందరికీ తెరమీద క్రెడిట్ ఇవ్వడానికి తానేమీ వెనుకాడనని ఇంద్రగంటి అన్నాడు. ‘సమ్మోహనం’ ఎంతటి ఒరిజినల్ మూవీ అన్నది విడుదలయ్యాక అందరికీ తెలుస్తుందని అన్నాడు. ఐతే తనను సంప్రదించకుండా.. వివరణ తీసుకోకుండా ఏదేదో ఊహించుకుని తానేదో కాపీ కొట్టేసినట్లు ప్రచారం చేయడం తనను అవమానించడమే అంటూ ఆవేదన స్వరం వినిపించాడు ఇంద్రగంటి. ఆయన ఇలా స్పందించాడటంటే ‘సమ్మోహనం’ సొంత కథే అయ్యుండొచ్చు. కాకపోతే ఏవైనా సినిమాలు.. రచనల స్ఫూర్తి కొంత మేరకు ఉంటే ఉండొచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు