ఆ సినిమా తీసి తీరతానంటున్న పూరి

ఆ సినిమా తీసి తీరతానంటున్న పూరి

మహేష్ బాబు హీరోగా రెండేళ్ల కిందటే ‘జనగణమన’ అనే సినిమా అనౌన్స్ చేశాడు పూరి జగన్నాథ్. ఒక పోస్టర్ కూడా వదిలారు అప్పట్లో. ఐతే పూరి వరుస ఫ్లాపుల్లో ఉండబట్టో ఏమో.. మహేష్ ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఈ విషయంలో పూరి తన అసహనాన్ని కూడా చూపించాడు. ఆ తర్వాత మరో సందర్భంలో మహేష్ బాబుతో ఎప్పటికైనా ఆ సినిమా చేస్తానని ప్రకటించాడు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మహేష్.. పూరికి దొరకడం సందేహంగానే ఉంది. ఐతే మహేష్ తనతో చేసినా చేయకపోయినా.. ‘జనగణమన’ అనే సినిమాను మాత్రం తాను ఎప్పటికైనా తీసి తీరుతానని అంటున్నాడు పూరి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ‘జనగణమన’ లాంటి సినిమా సమాజానికి చాలా అవసరమని పూరి అభిప్రాయపడ్డాడు.

అసిఫా లాంటి అమ్మాయిలకు అన్యాయం జరిగినపుడు అందిరిలాగే తాను కూడా మథన పడతానని.. దేశం ఎటు పోతోందా అనిపిస్తుందని.. ఇలాంటి అఘాయిత్యాలకు స్పందనగానే తాను ‘జనగణమన’ కథ రాసినట్లు పూరి చెప్పాడు. ఒక ఆదర్శవంతమైన దేశం ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తానని.. జనాల ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుందని పూరి చెప్పాడు. ఇక తన కొత్త సినిమా ‘మెహబూబా’ గురించి చెబుతూ తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని.. ఈ సినిమా చూశాక ఎవరో కొత్త దర్శకుడు తీశాడేమో అని జనాలు అనుకున్నా ఆశ్చర్యం లేదని.. తన శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దానని.. మనసు పెట్టి ఈ సినిమా తీశానని పూరి అన్నాడు. తన తర్వాతి రెండు సినిమాలు కూడా తన కొడుకు పూరి ఆకాశ్‌తోనే ఉంటాయని.. తర్వాత వేరే హీరోలతో చేస్తానని పూరి వెల్లడించాడు.