ఆ నాలుగు ఛానెళ్లపై బన్నీ బ్యాన్?

ఆ నాలుగు ఛానెళ్లపై బన్నీ బ్యాన్?

తెలుగు సినీ పరిశ్రమ జనాలకు.. మీడియాకు కొంత కాలంగా నడుస్తున్న రగడ గురించి తెలిసిందే. ఒక దశలో పరిశ్రమ వైపు నుంచి మీడియాపై ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్లు వినిపించాయి. కొన్ని ఛానెళ్లకు ప్రకటనలు.. సినిమాలకు సంబంధించిన సమాచారం పూర్తిగా ఆపేయాలన్న చర్చ కూడా నడిచింది. ఐతే ఈ విషయంలో తర్వాత వెనక్కి తగ్గారు. బ్యాన్ ప్రతిపాదన తేవడంలో మెగా ఫ్యామిలీదే కీలక పాత్ర అన్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కు.. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కొన్ని ఛానెళ్లు కుట్ర పన్నాయని ఆ ఫ్యామిలీ వ్యక్తులు బలంగా నమ్ముతున్నారు. అందుకే బ్యాన్ కోసం మెగా ఫ్యామిలీ నుంచి గట్టిగానే ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. కానీ అలా చేయడం వల్ల విపరీత పరిణామాలు తలెత్తుతాయని సినీ పెద్దలు వెనక్కి తగ్గారు. ఐతే మెగా ఫ్యామిలీ వాళ్లకు మాత్రం కొన్ని టీవీ ఛానెళ్లపై ఆగ్రహం తగ్గినట్లు లేదు. ఆ ప్రభావం ‘నా పేరు సూర్య’ప్రమోషన్లలో కనిపిస్తోంది.

ఏ ఛానెళ్లనైతే బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వచ్చాయో ఆ నాలుగు ఛానెళ్లలో ‘నా పేరు సూర్య’ ప్రమోషనల్ కార్యక్రమాలేవీ చేయట్లేదు చిత్ర బృందం. ఈ రోజు మీడియాను కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు బన్నీ. టీవీ ఛానెళ్లతోనూ మాట్లాడాడు. ఐతే మిగతా ఛానెళ్లతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకున్న బన్నీ.. ఆ నాలుగు ఛానెళ్లకు మాత్రం దూరంగా ఉండిపోయాడు.
మొన్ననే మెగా ఫ్యామిలీ అంతా ఆ ఛానెళ్లను తిట్టి ఇప్పుడెళ్లి ఆ ఛానెళ్లలోనే కూర్చుని ప్రమోషన్ చేస్తే జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయని అల్లు కుటుంబం భావించినట్లుంది. ఐతే ‘నా పేరు సూర్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ జాబితాలోని ఒకట్రెండు ఛానెళ్లలో ప్రసారం కావడం గమనార్హం. అప్పుడే సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ జనాలకు కౌంటర్లు పడ్డాయి. ఇప్పుడు నేరుగా ఆ ఛానెళ్లకే వెళ్లి ప్రమోషన్ చేస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? అందుకే బన్నీ అండ్ టీం వెనక్కి తగ్గినట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు