బాబు ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టే టైం వ‌చ్చేసిందా ?

యనమల రామక్రిష్ణుడు సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీలో ఆయన చంద్రబాబు తరువాత అంతటి వారుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్ధిక వ్యవహారాల్లో తాను దిట్టనని కూడా ఆయన చాటుకుంటారు. మరో వైపు స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో యనమల శాసనసభా వ్యవహారాల్లో టీడీపీకి ఎన్నో సార్లు వ్యూహాల్లో సాయం చేశారు. అలా విపక్షాన్ని ఫల్టీ కొట్టించారు.

అంతవరకూ ఎందుకు 2020లో శాస‌నమండలిలో చివరి నిముషంలో మూడు రాజధానుల బిల్లు పాస్ కాకుండా చూసిన ఘనత కూడా ఆయనదే అంటారు. ఒక విధంగా చూస్తే టీడీపీలో ఆయన రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు. అస‌లు ఎన్టీఆర్‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి గ‌ద్దె దింపిన‌ప్పుడు ఆయ‌న స్పీక‌ర్‌గా ఉన్నారు. ఆ రుణం తీర్చుకునేందుకే చంద్ర‌బాబు ఇంకా ఆయ‌న్ను భ‌రిస్తూ వ‌స్తున్నార‌ని టీడీపీ వాళ్లు కూడా అంటూ ఉంటారు.

చంద్రబాబు సైతం ఆయన రుణాన్నిఊరకే ఉంచుకోలేదు. అనేక కీలక పదవులు ఇచ్చి మర్యాదగానే చూశారు. య‌న‌మ‌ల కూడా చంద్రబాబుకు ఎప్ప‌టిక‌ప్పుడు అనుకూలంగా వ్యవహరిస్తూ వ‌స్తున్నారు. ఇలా బాబుకు పాతికేళ్ళుగా సాయం చేస్తూ వస్తున్న యనమల రాజకీయంగా మాత్రం తన సొంత నియోజకవర్గం తునిలో ఏమాత్రం పట్టు సాధించలేకపోయారు అన్నది వాస్తవం. ఆయన పట్టు తునిలో పూర్తిగా జారిపోతోంది. అది ఆయనకు కూడా తెలుసు. చివరిసారిగా ఆయన 2004 ఎన్నికల్లోనే తునిలో గెలిచారు. అంటే గత రెండు దశాబ్దాలుగా యనమల కుటుంబాన్ని తుని ప్రజలు వరసబెట్టి ఓడిస్తూనే ఉన్నారు.

ఒక సాధారణ న్యాయవాదిగా ఉన్న యనమల 1983లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆనాటికి బలమైన తుని రాజుల మీద ఘన విజయం సాధించారు. అనంతరం ఆయన టీడీపీలో చేరిపోయి వరసగా గెలుస్తూ వచ్చారు. అయితే యనమల తునిలో పార్టీ మీద దృష్టి పెట్టకపోవడం, తమ్ముడు క్రిష్ణుడి మీద పూర్తిగా బాధ్యతలు వదిలేయడంతో సైకిల్ జోరు బాగా తగ్గిపోయింది. ఇక యనమలకు వారసులు ఎవరూ లేరు. కుమార్తెలు రాజకీయాల్లోకి రారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న కుమార్తె దివ్య‌కు తుని లేదా కాకినాడ రూర‌ల్ సీటు ఇప్పించుకోవాల‌ని హ‌డావిడి చేసినా బాబు ప‌ట్టించుకోలేదు.

ఇక తునిలో తమ్ముడు క్రిష్ణుడిని కూడా జనాలు తిరస్కరించడంతో పెద్దాయన రాజకీయం పూర్తిగా చరమాంకానికి వచ్చేసినట్లే అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వమైతే 2025 వరకూ ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయనక్కరలేదు. ఆ తరువాత రాజకీయాల నుంచి పూర్తిగా రెస్ట్ తీసేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా యనమల ఫ్యామిలీని పక్కన పెట్టి కొత్తవారిని ఇక్కడ టీడీపీ తయారు చేసుకోకపోతే మాత్రం ఈ సీటుని శాశ్వతంగా వదిలేసుకోవాల్సిందే అంటున్నారు.