ప్రభాస్.. ‘స్పైడర్’ గుర్తుందా?

ప్రభాస్.. ‘స్పైడర్’ గుర్తుందా?

బడ్జెట్ ఎక్కువైనంత మాత్రాన సినిమా ఆడేస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. భారీ ఖర్చుతో, ఎంతో శ్రమతో తీసే ఎపిసోడ్లే సినిమాకు ప్రతికూలంగా మారిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇందుకు ‘స్పైడర్’ సినిమా ఒక ఉదాహరణ. ముందు ఓ మోస్తరు బడ్జెట్లో మామూలుగానే ఈ చిత్రం తీయాలనుకున్నారు. కానీ ‘బాహుబలి’ ప్రభావమో ఏమో.. భారీతనం కోరుకున్నారు. విజువల్ ఎఫెక్టుల కోసం ప్రయాస పడ్డారు. బడ్జెట్ పెంచారు. వర్కింగ్ డేస్ పెరిగాయి. చాలా కష్టపడ్డారు. చివరికి వీఎఫెక్స్‌తో ముడిపడ్డ సీన్లు అందులో ఎలా తయారయ్యాయో తెలిసిందే.

సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయనుకున్నా ఆ సన్నివేశాలే ప్రతికూలంగా మారాయి.  సినిమా తేడా కొట్టేసింది. కాబట్టి  పదుల కోట్లు ఖర్చు పెట్టాం. ప్రేక్షకులు చూసి మైమరిచిపోతారు అనుకోవడానికేమీ లేదు. కేవలం భారీతనం మాత్రమే ప్రేక్షకుల్ని మెప్పించదన్న విషయం గుర్తుంచుకోవాలి.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’కు సంబంధించి బడ్జెట్ సంగతుల గురించి అంత చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో కేవలం ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.90 కోట్లు ఖర్చు చేశారట. దీని గురించి మీడియాకు లీకులిచ్చి ఊదరగొట్టేస్తోంది చిత్ర బృందం. ఐతే అంత ఖర్చు పెట్టి ఒక ఎపిసోడ్ తీసినంత మాత్రాన సినిమా ఆడేస్తుందా? ఆ భారీతనం చూసి జనాలు ఉర్రూతలూగిపోతారా? అన్నది ఆలోచించుకోవాలి. నిజానికి ‘సాహో’కు సంబంధించి మొదట్నుంచి ఈ భారీతనం గురించే చర్చ నడుస్తోంది. బాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద నటీనటుల్ని సాంకేతిక నిపుణుల్ని తీసుకురావడం.. దుబాయ్ యాక్షన్ ఎపిసోడ్ గురించి మొదట్నుంచి ఊదరగొట్టడం.. ఇదంతా మన జనాలకు పెద్దగా కనెక్టవ్వట్లేదు.

కంటెంట్ పరంగా ఇందులో ఏమాత్రం బలం ఉంటుందో అన్న సందేహాలు మొదట్నుంచి కలుగుతున్నాయి. కేవలం ఈ ‘భారీ’ హంగామాతోనే బండి లాగించేస్తారా.. నిజంగా ఇందులో విషయం ఏమీ ఉండదా అన్న చర్చ నడుస్తోంది. కాబట్టి ఈ హంగులు.. ఆకర్షణల సంగతలా ఉంచి విషయం మీద చిత్ర బృందం కొంచెం శ్రద్ధ పెడితే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు