డాలర్ల దండ పడితే సరిపోదు బన్నీ..

డాలర్ల దండ పడితే సరిపోదు బన్నీ..

తెలుగు రాష్ట్రాల్లో.. ఇంకా దక్షిణాదిన ఉన్న మిగతా రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ గత కొన్నేళ్లలో బాగానే పెరిగింది. కేరళలో అతను పెద్ద స్టార్ అయిపోయాడు. కర్ణాటకలోనూ మంచి మార్కెట్ ఉంది. తమిళనాడులో పర్వాలేదు. ఈ మధ్య ఉత్తరాదిన తన డబ్బింగ్ సినిమాలతో మంచి ఫాలోయింగే సంపాదించాడు. ఇలా ఇండియా అంతటా విస్తరిస్తున్నాడు కానీ.. ఓవర్సీస్‌లో మాత్రం అతను పెద్దగా ఎదగలేదు.

తన తోటి హీరోలందరూ అక్కడ దూసుకెళ్లిపోతుంటే.. బన్నీ ఇంకా ఎక్కడో ఉన్నాడు. రెండేళ్ల కిందటి వరకు ఓవర్సీస్‌లో చాలా వీక్‌గా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ‘రంగస్థలం’తో 3.5 మిలియన్ల మార్కును అందుకుని నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పాడు. మహేష్ బాబుకు ముందు నుంచి అక్కడ మంచి మార్కెట్ ఉండగా.. గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడ పెద్ద విజయాలందుకున్నాడు.

కానీ బన్నీకి మాత్రం ఓవర్సీస్‌లో కలిసి రావడం లేదు. అతడి చివరి సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ అమెరికాలో పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ‘నా పేరు సూర్య’ అక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తుందో అన్న సందేహాలున్నాయి. బన్నీ సినిమాల గురించి ప్రచారం హోరెత్తించే పీఆర్ టీం ఏమో.. ‘నా పేరు సూర్య’ యుఎస్ ప్రిమియర్లకు రెస్పాన్స్ అదుర్స్ అంటోంది. అక్కడ బన్నీ పోస్టరుకు డాలర్ల దండ వేసిన ఫొటోను షేర్ చేస్తూ హడావుడి చేస్తోంది. కానీ పోస్టర్ కు డాలర్ల దండ వేస్తే సరిపోదు. సినిమా మీద డాలర్ల వర్షం కురవాలి.

‘దువ్వాడ జగన్నాథం’కు ఓవర్సీస్ రైట్స్ రూ.8 కోట్లు పలికితే.. ‘నా పేరు సూర్య’కు రూ.6 కోట్లే పలికాయి. దీన్ని బట్టే అక్కడ బన్నీ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కూడా తేడా వస్తే అంతే సంగతులు. తర్వాతి సినిమాకు రేటు ఇంకా పడుతుంది. కాబట్టి బన్నీ ఈసారి అక్కడ కొట్టాల్సిందే. మార్కెట్ పెంచుకోవాల్సిందే. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు