అల్లు అర్జున్‌కి తలపోటైపోయారు

అల్లు అర్జున్‌కి తలపోటైపోయారు

రంగస్థలం, భరత్‌ అనే నేను చల్లబడ్డాయి కనుక 'నా పేరు సూర్య'కి తిరుగు వుండదని ఆ చిత్ర నిర్మాతలు, బయ్యర్లు భావించారు. కానీ అనుకోని అవారతరం అవెంజర్స్‌ రూపంలో వచ్చిపడింది. అవెంజర్స్‌ 3 చిత్రం అత్యద్భుత వసూళ్లు సాధిస్తూ వుండడంతో దీనిని తీసివేయడానికి, షోలు తగ్గించడానికి మల్టీప్లెక్సులు నిరాకరిస్తున్నాయి.

దీంతో 'నా పేరు సూర్య' మల్టీప్లెక్స్‌ షోలకి గండి పడుతోంది. చిన్నా చితకా మల్టీప్లెక్సుల్లో కూడా 'నా పేరు సూర్య'కి ఎక్కువ షోలు దొరకడం లేదు. పైగా అవెంజర్స్‌ త్రీడీ సినిమా కనుక, కళ్లద్దాల మీద చార్జీల రూపంలో మరో పాతిక రూపాయలు వసూలు చేయవచ్చు కనుక 2డి సినిమాల కంటే దీని వైపే మల్టీప్లెక్సులు మొగ్గుతున్నాయి. దీంతో ఒక భారీ చిత్రానికి సహజంగా లభించేటన్ని షోలు 'నా పేరు సూర్య'కి దొరకడం లేదు.

దీనిని కాంపన్సేట్‌ చేయడానికా అన్నట్టు సింగిల్‌ స్క్రీనుల్లో తొలి వారం అయిదు షోలు వేసుకోవడానికి ఉభయ రాష్ట్రాల నుంచి పర్మిషన్‌ తెచ్చుకున్నారు. అయితే మల్టీప్లెక్స్‌ షో టైమింగ్స్‌తో వుండే అడ్వాంటేజ్‌ ఈ అయిదు షోలతో రాదని చాలాసార్లు రుజువైంది. నిజానికి ఈ అయిదు షోల టాక్టిక్‌ ఇంతవరకు సత్ఫలితాలనివ్వలేదు. కానీ అవెంజర్స్‌ వల్ల వస్తోన్న మల్టీప్లెక్సుల రెవెన్యూ నష్టాన్ని కాస్తయినా భర్తీ చేసుకోవడానికి ఇది పనికొస్తుందని ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు