‘కాలా’ సంచలనం.. ఒక్క పాటకు 10 లక్షల మంది

‘కాలా’ సంచలనం.. ఒక్క పాటకు 10 లక్షల మంది

ఒకే పాటను ఇద్దరు ముగ్గురు కలిసి పాడటం చూస్తుంటాం. కొన్నిసార్లు వాయిస్‌లు మరిన్ని పెంచి.. అరడజను మంది.. పది మందితో కూడా ఒకే పాటను పాడిస్తుంటారు. కోరస్ వాయిస్‌లు కూడా కలిపితే కొన్నిసార్లు వాయిస్‌లు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ ఒక్క పాట కోసం పది లక్షల వాయిస్‌లు రికార్డ్ చేయడం అన్నది ఎప్పుడైనా విన్నామా? ఐతే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కాలా’ కోసం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఇదే ప్రయోగం చేశాడట.

ఈ చిత్రంలో ఒక పాట కోసం తాను మిలియన్ వాయిస్‌లు రికార్డు చేసినట్లు అతను వెల్లడించాడు. ఇలా ఒక పాట రికార్డ్ చేయాలన్నది తన కల అని.. అందుకోసం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నానని.. చివరికి ‘కాలా’తో అది కుదిరిందని.. ఈ పాట శ్రోతలకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని సంతోష్ నారాయణన్ చెప్పాడు.

‘కాలా’ నుంచి ఇప్పటికే ఒక థీమ్ సాంగ్ రిలీజైంది. ఇంకో వారం రోజుల్లో ఫుల్ ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఐదు నిమిషాల పాటలో పది లక్షల మంది గొంతును ఎలా వినిపించారు.. దీని ప్రత్యేకత ఏంటి.. ఇది ఎలా సాధ్యమైంది అన్నది ఆడియో విని తెలుసుకోవాలి. ఇంతకుముందు రజనీకాంత్-పా.రంజిత్ కాంబినేషన్లో వచ్చిన ‘కబాలి’కి కూడా సంతోషే సంగీతం అందించాడు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అందులో సంతోష్ సంగీతం ప్రశంసలందుకుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్‌కు చాలా మంచి అప్లాజ్ వచ్చింది.

మరి ‘కాలా’తో అతను ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. అట్టడుగు స్థాయి నుంచి డాన్‌గా ఎదిగిన వ్యక్తి కథతో తెరకెక్కిన ‘కాలా’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నానా పటేకర్, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు