3 నెలల్లో ఫ్లైట్ల‌లో సెల్‌.. ఇంట‌ర్నెట్‌!

3 నెలల్లో ఫ్లైట్ల‌లో సెల్‌.. ఇంట‌ర్నెట్‌!

క్ష‌ణం తీరిక లేకుండా.. నిత్యం సెల్ తో బిజీగా ఉండే జ‌నాల‌కు కాస్త రిలీఫ్ ఏమైనా ఉందంటే అది విమానాలు.. నౌక‌ల్లో ప్ర‌యాణించేట‌ప్పుడే. అయితే.. ఇప్పుడు అక్క‌డా సెల్ లొల్లి షురూ కానుంది. ఇప్ప‌టివ‌ర‌కూ విమాన ప్ర‌యాణాల్లోనూ.. నౌక‌ల్లో జ‌ర్నీ చేసే స‌మ‌యంలో సెల్ ఫోన్ కాల్స్ కు.. ఇంట‌ర్నెట్ సేవ‌లు వినియోగించుకునే అవ‌కాశం ఉండేది కాదు. అయితే.. ఈ విధానంలో మార్పులు చేయాల‌ని.. అక్క‌డ కూడా సేవ‌లు అందించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

ఆకాశంలో ప్ర‌యాణించే స‌మ‌యంలో దేశీయ విమానాలు.. అంత‌ర్జాతీయ విమానాల్లో ఫోన్ వాడే సౌక‌ర్యాన్ని క‌లుగ‌జేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు టెలికాం క‌మిష‌న్ ఓకే చెప్పేసింది. మ‌రో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో విమానాల్లోనూ.. నౌక‌ల్లోనే ఫోన్లు ఉప‌యోగించుకునే వీలుంద‌ని చెబుతున్నారు.

తాజాగా నిర్వ‌హించిన అత్యున్న‌త స‌మావేశంలో ఈ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. విమానం క‌నీసం 3వేల మీట‌ర్ల ఎత్తుకు చేరాక‌.. మొబైల్ సేవ‌ల్ని అనుమ‌తించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆకాశంలో టెలికం సేవ‌లు.. ఇంట‌ర్నెట్ స‌ర్వీసు అందుబాటులో లేదు. అయితే.. అంత‌ర్జాతీయంగా మాత్రం ప‌లు విమాన‌సంస్థ‌లు.. త‌మ ప్ర‌యాణికుల‌కు వైఫై సేవ‌ల్ని అందిస్తున్నాయి. అయితే.. ఇవ‌న్నీ భార‌త గ‌గ‌న‌త‌లంలోకి అడుగుపెట్టిన త‌ర్వాత ఆ సేవ‌లు నిలిచిపోతున్నాయి.

తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో ఇప్పుడా ఇబ్బందుల‌కు చెక్ ప‌డిన‌ట్లే. విమానాల్లో మాదిరే నౌక‌ల్లోనూ దేశీయ ప‌రిధిలోని జ‌లాల్లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత మొబైల్‌.. ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని పొందే వీలుంది. అయితే.. ఈ సేవ‌ల‌కు ఎంత ఛార్జీలు వ‌సూలు చేస్తార‌న్న విష‌యంలో మాత్రం క్లారిటీ రాలేదు. ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన త‌ర్వాత టెలికం ఆప‌రేట‌ర్లు నిర్ణ‌యాన్ని తీసుకునే వీలుంది. సో.. ఇప్ప‌టివ‌ర‌కూ విమానాల్లో ప్ర‌యాణించేట‌ప్పుడు ర‌ణ‌గొణ ధ్వ‌నులు పెద్ద‌గా ఉండ‌ని ప‌రిస్థితి నుంచి.. ప్ర‌తిఒక్క‌రూ త‌మ సెల్ ఫోన్ల‌తోనూ.. ట్యాబ్ ల‌తోనో.. ల్యాపీల‌తోనో బిజీ.. బిజీగా ఉండే ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోనున్నార‌న్న మాట‌. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు