బన్నీ టార్గెట్‌ ఎనభై కోట్లు

బన్నీ టార్గెట్‌ ఎనభై కోట్లు

రంగస్థలం, భరత్‌ అనే నేను ఆయా హీరోల కమర్షియల్‌ రేంజ్‌ని చాటిచెప్పాయి. రెండు చిత్రాలకీ భారీ టార్గెట్‌ వున్నప్పటికీ అంచనాలని అందుకోగలిగాయి. ఇప్పుడిక వేసవిలో తెలుగు సినిమా నుంచి వస్తోన్న చివరి భారీ చిత్రం 'నా పేరు సూర్య'. డెబ్బయ్‌ కోట్ల మార్కెట్‌ సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌కి ఈసారి టార్గెట్‌ ఇంకాస్త పెద్దది. 'నా పేరు సూర్య'కి ఎనభై కోట్ల షేర్‌ వస్తే సక్సెస్‌ కింద లెక్క. అంటే ఈ చిత్రం హిట్టవ్వాలంటే అల్లు అర్జున్‌ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించాలి. కొత్త దర్శకుడితో, కాస్త సీరియస్‌ సబ్జెక్ట్‌తో అల్లు అర్జున్‌పై ఈసారి భారీ బాధ్యతే వుంది.

ట్రెయిలర్స్‌ చూస్తే మినిమం గ్యారెంటీలానే అనిపిస్తున్నా కానీ ఒక సినిమా విజయానికి చాలా ఫ్యాక్టర్లు ఆధారపడతాయి. వరుసగా రెండు భారీ విజయాలు రావడం వల్ల మార్కెట్లో కాస్త స్తబ్ధత వచ్చే అవకాశముంది. అంటే ఇప్పుడు యావరేజ్‌ సినిమా వస్తే తిరస్కరణకి గురయ్యే ఛాన్సులెక్కువ. కనుక ఈ ఎనభై కోట్ల వ్యవహారం కాస్త రిస్కుతో కూడుకున్న వ్యవహారమే. మంచి టాక్‌ వస్తే ఎనభై కోట్లు సాధించడం ఇప్పటి మార్కెట్‌ ప్రకారం అంత కష్టమైన టార్గెట్‌ ఏమీ కాదు. కాకపోతే డిజె, సన్నాఫ్‌ సత్యమూర్తిలా డివైడ్‌ టాక్‌ వస్తే మాత్రం టార్గెట్‌ క్లిష్టతరమవుతుంది. ఇద్దరు అగ్ర హీరోలు భారీ విజయాలు అందుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్‌పై ఈసారి ఒత్తిడి కాస్త ఎక్కువగానే వుంటుంది. ఈ పరీక్షలో సూర్య ఏ మేరకు నెగ్గుకొస్తాడనేది వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు