అసలు తేజకి డిమాండ్‌ చేసేంత సీనుందా?

అసలు తేజకి డిమాండ్‌ చేసేంత సీనుందా?

'నేనే రాజు నేనే మంత్రి' ఆర్థిక విజయాన్ని అందుకుంది కానీ అది అచ్చంగా తేజ గొప్పతనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బాహుబలితో రాణాకి వచ్చిన గుర్తింపుకి తోడు ఆ చిత్రానికి చేసిన పబ్లిసిటీ మాస్‌ని ఆకట్టుకుంది. నిజానికి ఆ చిత్రంలో కంటెంట్‌ చాలా వీక్‌. ప్రధానంగా ద్వితియార్ధం గాడి తప్పి సెకండ్‌ వ్యూయింగ్‌కి అవకాశమే లేకుండా తయారైంది. కానీ విడుదలకి ముందు రేకెత్తించిన ఆసక్తితో మొదటి అయిదు రోజులు మంచి వసూళ్లు రాబట్టుకుని హిట్టయిపోయింది. అది రాణా క్రెడిట్టే తప్ప దర్శకుడిగా తేజ చేసిందేమీ లేదు.

చిత్రం, నువ్వు నేను, జయంతో దర్శకుడిగా భారీ విజయాలని అందుకున్న తేజకి అది ఏ విధంగాను కమ్‌బ్యాక్‌ సినిమా కాదు. కాకపోతే దాంతో తనని తాను ఎక్కువ అంచనా వేసుకుంటూ తదుపరి చిత్రాలకి గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలయ్యతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ డ్రాప్‌ అవడంలో తేజ పార్టే ఎక్కువని గాసిప్స్‌ వున్నాయి. ఈ చిత్రాన్ని ఎలా మలచాలి అనే దానిపై అసలు హోమ్‌వర్క్‌ చేయకుండా వచ్చి, వాళ్లు ఇచ్చిన స్క్రిప్టుకి అనుగుణంగా తీయడానికి కూడా నిరాకరించాడట. పలుమార్లు అభిప్రాయబేధాలు రావడంతో అతడిని తప్పించాలని డిసైడ్‌ అయ్యారని, అది బయటకి పొక్కకముందే తానే తప్పుకున్నట్టు మీడియాకి ఫీలర్లు అందించాడని భోగట్టా. అంతే కాకుండా పారితోషికం పరంగాను తన రేంజికి మించి డిమాండ్‌ చేస్తున్నాడని, ఈ కారణమ్మీదే వెంకటేష్‌తో సినిమా కూడా ఆగిపోయిందని మరో రూమర్‌.

ఈ రూమర్లలో వాస్తవమెంత అనేది తెలియదు కానీ స్టార్లని తేజ హ్యాండిల్‌ చేయలేడనేది బలంగా నాటుకుపోయింది. మళ్లీ కొత్తవాళ్లతోనే తదుపరి చిత్రం చేస్తాడో ఏమో. ఈసారి నేనే రాజు నేనే మంత్రి లాంటి సబ్‌ స్టాండర్డ్‌ ప్రోడక్ట్‌తో సక్సెస్‌ కొట్టేయడమయితే జరిగే పని కాదు మరి. మునుపటి తేజని వెలికి తీసి 'జయం' అందుకుంటేనే పూర్వ వైభవం సాధించేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు