బాహుబలి ప్రభాస్‌ని చెడగొట్టిందా?

బాహుబలి ప్రభాస్‌ని చెడగొట్టిందా?

ప్రభాస్‌కి కథ చెప్పడానికి వెళ్లిన దర్శకులు అందరికీ విచిత్రమైన సమస్య ఎదురవుతోందట. ఏ దర్శకుడు కథ చెప్పడానికి వెళ్లినా కానీ తెలుగు మార్కెట్‌ని కాకుండా ఇండియన్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేసేలా కథ రాయమంటున్నాడట. ప్రభాస్‌ ప్రధానంగా తెలుగు హీరో. అతనికి బాహుబలితో నేషనల్‌ వైడ్‌ గుర్తింపు వచ్చినా కానీ అతడి ప్రధాన మార్కెట్‌ తెలుగు రాష్ట్రాలే. బాహుబలి చిత్రాన్ని కూడా తెలుగు మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకునే తీసారు తప్ప ఇండియా వైడ్‌గా అంతటి ఘన విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశం లేదు. ఆ చిత్రంలోని తారాగణం బట్టే అది కేవలం తెలుగు సినిమా అని స్పష్టమవుతుంది. అయితే ప్రభాస్‌ మాత్రం బాహుబలి ఇచ్చిన క్రేజ్‌ని వాడుకోవాలని చూస్తున్నాడు. ఇది అతని తదుపరి చిత్రాల ప్లానింగ్‌ని దెబ్బ తీస్తోంది.

ఇప్పటికే సుజిత్‌తో చేస్తోన్న సాహో చిత్రం స్కేల్‌ పెంచేసారు. జిల్‌ దర్శకుడు రాధాకృష్ణ చిత్రాన్ని కూడా అలాగే నేషనల్‌ వైడ్‌ మార్కెట్‌కి అనుగుణంగా మలుస్తున్నారు. దీంతో ప్రభాస్‌తో అచ్చమైన తెలుగు సినిమా తీద్దామని వెళుతోన్న దర్శకులకి చుక్కెదురవుతోంది. అతని డిమాండ్లు మరీ శృతి మించడంతో పలువురు ఇప్పటికే ప్రభాస్‌తో ప్రాజెక్టులు డ్రాప్‌ అయ్యారు. సాహో, రాధాకృష్ణ చిత్రం రిలీజ్‌ అయితే అతనికి బాలీవుడ్‌ మార్కెట్‌పై ఒక క్లారిటీ వస్తుందని, తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపై ఒక అంచనాకి వస్తాడని, అంతవరకు ప్రభాస్‌ని కదిలించకపోవడమే మంచిదని మన దర్శకులు డిసైడ్‌ అయ్యారంటే ప్రస్తుతం ప్రభాస్‌ ఆలోచనలు ఎలాగున్నాయనేది అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు