బయోపిక్ పోయినా బాధ లేదులే

బయోపిక్ పోయినా బాధ లేదులే

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కించాలని అనుకున్న ‘యన్.టి.ఆర్’ సినిమాకు తేజను దర్శకుడిగా ఎంచుకోవడమే అనూహ్యమైన విషయం. ఈ ఎంపిక ఎవ్వరూ ఊహించనిది. అసలు తేజ ఇలాంటి సినిమాను ఎలా డీల్ చేస్తాడు.. చాలా ముక్కుసూటిగా ఉండే తేజ.. ఎన్నో వివాదాలతో ముడిపడ్డ సినిమాను ఎలా తీస్తాడ.. బాలయ్యకు అతడికి ఎలా లంకె కుదురుతుంది అని చాలామంది సందేహించారు.

చివరికి ఆ సందేహాలకు తగ్గట్లే ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. ఈ సినిమా ఓకే కావడానికంటే ముందు తేజ మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమా మొదలుపెట్టి కొన్ని నెలల పాటు దాని మీద పని చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఎన్టీఆర్ బయోపిక్ కోసమని దాన్ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది.

ఐతే ఇప్పుడు బయోపిక్ నుంచి బయటికి వచ్చేసిన నేపథ్యంలో తేజ రెంటికీ చెడ్డ రేవడైపోయాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తేజ మళ్లీ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్లో తేలాడని సమాచారం. బయోపిక్ ఆగిపోయిన నేపథ్యంలో సురేష్ బాబే పిలిచి తేజతో మళ్లీ వెంకీ సినిమా పని మొదలుపెట్టించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌ను దసరాకే రిలీజ్ చేయాలని బాలయ్య పట్టుబట్టిన నేపథ్యంలో సురేష్ బాబుతో మాట్లాడి సుహృద్భావ వాతావరణంలోనే వెంకీ సినిమాను పక్కన పెట్టించాడు తేజ. ‘నేనే రాజు నేనే మంత్రి’తో తమకు మంచి లాభాలు.. రానాకు సోలో హీరోగా పెద్ద హిట్టు ఇచ్చిన తేజ విషయంలో సురేష్ చాలా పాజిటివ్‌గా ఉన్నారు.

కాబట్టి ఇప్పుడు తిరిగి వెంకీ సినిమాను మొదలుపెట్టించడానికి ఆయనేమీ ఇబ్బంది పడట్లేదు. కాకపోతే ముందు అనుకున్న ప్రకారం షూటింగ్ చేసి ఉంటే ఈ పాటికి సినిమా ముగింపు దశకు వచ్చేది. వెంకీ చాన్నాళ్లుగా ఖాళీగా ఉన్నాడు. టైం వేస్టయిపోయింది. తేజ సినిమా లేదనుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్-2’ ఓకే చేశాడు వెంకీ. ఆ చిత్రాన్ని జూన్‌లోనే మొదలుపెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తేజ సినిమాకు ఎలా డేట్లు సర్దుబాటు చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు