పిచ్చెక్కించేస్తున్న ‘సంజు’ పోస్టర్

పిచ్చెక్కించేస్తున్న ‘సంజు’ పోస్టర్

బాలీవుడ్లో ‘మంచి’ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రాజ్ కుమార్ హిరాని. మున్నాభాయ్ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలే కాదు.. ఆ తర్వాత తీసిన ‘3 ఇడియట్స్’.. ‘పీకే’ కూడా గొప్ప సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ సినిమాలతో చాలా మంచి విషయాలు చెప్పాడు హిరాని. ఐతే ఆయన తొలిసారిగా తన సినిమాలో చెడును కూడా చూపించబోతున్నాడు. ఒక వ్యక్తి జీవితంలోని ఎత్తుపల్లాల్ని తెరపై ఆవిష్కరించబోతున్నాడు.

ఆ వ్యక్తి మరెవరో కాదు.. హిరాని మిత్రుడు సంజయ్ దత్. అతడి జీవిత కథ ఆధారంగా రణ‌బీర్ కపూర్ హీరోగా ‘సంజు’ సినిమాను రూపొందించాడు హిరాని. అతను ఈ సినిమా మొదలుపెట్టినపుడు.. గత సినిమాలతో పోల్చి చూస్తూ ఇది అవసరమా అన్నారందరూ. కానీ ఎలాంటి కథనైనా తనదైన శైలిలో ఆవిష్కరించగలిగే హిరాని.. సంజు బయోపిక్ విషయంలోనూ ప్రత్యేకత చాటుకున్నాడు.

‘సంజు’ ఫస్ట్ టీజర్ చూసినపుడే జనాలకు పిచ్చెక్కిపోయింది. ఒక అద్భుతమైన సినిమా చూడబోతున్న భావన కలిగింది. ఇందులో సంజయ్ దత్‌ను రణబీర్ దించేసిన తీరుకు ఫిదా అయిపోయారంతా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ‘సంజు’గా రణబీర్ క్లోజప్‌ లుక్ చూపిస్తున్న పోస్టర్ అది. సడెన్‌గా అది చూస్తే అక్కడున్నది సంజయ్ దత్ అనుకుంటారేమో.

అంత బాగా దాన్ని డిజైన్ చేశారు. రణబీర్ మేకప్.. హావభావాలు కూడా అలా ఉన్నాయి. ముఖ్యంగా సంజయ్‌ దత్ నిద్ర కళ్లను అలాగే రణబీర్ దించేయడం షాకింగే. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాపై అంచనాల్ని మరింత పెంచేలా ఉందీ పోస్టర్. ‘సంజు’ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.