‘రంగస్థలం’ ఫీట్ అద్భుతమే

‘రంగస్థలం’ ఫీట్ అద్భుతమే

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు రూ.100 కోట్ల వసూళ్లు సాధిస్తే ఔరా అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమాలు వంద కోట్ల వసూళ్లు సాధించడం చాలా మామూలైపోయింది. మన సూపర్ స్టార్ల సినిమాలు ఎలాంటి టాక్ తెచ్చుకున్నప్పటికీ అలవోకగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా కొత్త బెంచ్ మార్క్ కోసం చూస్తోంది.

‘బాహుబలి’ లాంటి ప్రత్యేకమైన సినిమాల్ని ఇక్కడ లెక్కలోకి తీసుకోకూడదు. మిగతా సినిమాల్లో కొన్ని రూ.150 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేశాయి. ఐతే ఇప్పుడు రామ్ చరణ్-సుకుమార్‌ల ‘రంగస్థలం’ టాలీవుడ్‌కు కొత్త నాన్-బాహుబలి బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఇది మామూలు రికార్డు కాదు.

తమిళంలో రజినీకాంత్ సినిమాలు ఎప్పుడో రూ.200 కోట్ల మార్కును అందుకున్నాయి. కానీ తెలుగులో ‘బాహుబలి’ మినహా ఏ సినిమా కూడా ఆ మైలురాయిని టచ్ చేయలేదు. అందుకు ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని అనుకున్నారు. ఒకవేళ ఆ రికార్డు అందినా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్లు బ్లాక్ బస్టర్లు కొట్టినపుడే సాధ్యం అనుకున్నారు. కానీ వీళ్లతో పోలిస్తే తక్కువ మార్కెట్ ఉన్న రామ్ చరణ్ ఈ రికార్డును టచ్ చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు.

ఐతే సుకుమార్ అండతో చరణ్ అద్భుతమే చేశాడు. ఈ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ పేరిట ఉన్న నాన్-బాహుబలి షేర్ రికార్డును అందుకోవడమే చాలా గొప్ప విషయం అనుకున్నారు. కానీ రూ.105 కోట్ల షేర్‌తో ఆ సినిమా నెలకొల్పిన రికార్డును దాటేసి ఇప్పుడు ఏకంగా రూ.120 కోట్ల షేర్‌ రాబట్టింది. మహేష్ మూవీ ‘భరత్ అనే నేను’ ఈ రికార్డును అందుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు