మహేష్‌, బన్నీ సేఫ్‌ అయిపోయారు

మహేష్‌, బన్నీ సేఫ్‌ అయిపోయారు

ఏప్రిల్‌ 27 డేట్‌ కోసం మహేష్‌, అల్లు అర్జున్‌ ఎంతగా పోటీ పడ్డారో తెలిసిందే. అయితే రెండు సినిమాల నిర్మాతలు జెంటిల్మన్‌ ఒప్పందానికి వచ్చి భరత్‌ అనే నేను, నా పేరు సూర్య మధ్య రెండు వారాల వ్యవధి వుండేట్లు చూసుకున్నారు. వీళ్లిద్దరూ కొట్టుకుని ఏప్రిల్‌ 27లాంటి సూపర్‌ డేట్‌ ఎవరికీ దక్కకుండా చేసారనే కామెంట్లు సయితం ఎదుర్కొన్నారు. అయితే దీని వల్ల ఈ రెండు సినిమాలు లాభపడ్డాయే తప్ప నష్టపోలేదు.

ఎందుకంటే హాలీవుడ్‌ అవెంజర్స్‌ చిత్రం కూడా ఇదే డేట్‌కి రిలీజ్‌ అయింది. పొరపాటున భరత్‌ లేదా సూర్య చిత్రాల్లో ఏది ఏప్రిల్‌ 27న రిలీజ్‌ అయినా కానీ చాలా నష్టపోయేవి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో అవెంజర్స్‌ ఎఫెక్ట్‌ తీవ్రంగా వుండేది. ఇక తెలుగు రాష్ట్రాల బయట, అంటే కర్నాటక, తమిళనాడుల్లో కూడా వసూళ్లకి గండి పడేది. అదే విధంగా మల్టీప్లెక్స్‌ షోస్‌ కూడా చాలా తగ్గిపోయేవి.

ఇండియా వైడ్‌గా తొలి వారాంతంలో అవెంజర్స్‌ నూట పాతిక కోట్లకి పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి ఈ యేడాదికి బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం అత్యద్భుత వసూళ్లని అందుకుంటోంది. అనుకోకుండా ఈ డేట్‌ని వదిలేయడం భరత్‌, సూర్య చిత్రాలకి వరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు