వక్కంతంకు టెస్టు పెడదామనుకున్నారట..

వక్కంతంకు టెస్టు పెడదామనుకున్నారట..

ఒక కొత్త దర్శకుడితో ఒక స్టార్ హీరో సినిమా చేయడానికి చాలా ఆలోచిస్తాడు. గత కొన్నేళ్లలో టాలీవుడ్లో స్టార్లు కొత్త దర్శకులతో సినిమాలు చేయడం బాగా తగ్గిపోయింది. కానీ అల్లు అర్జున్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ చేశాడు. రచయితగా వంశీ చాలా మంచి పేరు సంపాదించాడు.. సూపర్ హిట్లు ఇచ్చాడు కాబట్టే బన్నీ అతడితో సినిమా చేయడానికి ముందుకొచ్చాడనంలో సందేహం లేదు.

ఐతే రచయితగా ఎంత పేరు సంపాదించినా.. ఎలాంటి హిట్లు ఇచ్చినా దర్శకుడిగా ఒక సినిమాను ఎలా డీల్ చేస్తాడో అన్న భయం లేకుండా పోదు. అందులోనూ వక్కంతం దర్శకత్వ శాఖలో ఎన్నడూ పని చేసింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా కొన్ని సీన్లు టెస్ట్ షూట్ చేసి చూపించమని కొత్త దర్శకులకు టాస్క్ ఇస్తుంటాయి నిర్మాణ సంస్థలు. వక్కంతం విషయంలో కూడా అలా చేయాలన్న ఆలోచన వచ్చిందట అల్లు అరవింద్‌కు.

వక్కంతంతో ఏదైనా ఒక సీన్ తీయించి చూద్దాం అని బన్నీతో అన్నాడట అరవింద్. కానీ బన్నీ మాత్రం అలాంటిదేమీ అవసరం లేదు.. అతడి మీద తనకు నమ్మకం ఉంది అన్నాడట బన్నీ. వక్కంతంను అంతగా నమ్మి సినిమా చేశాడని.. అతనెందుకు అలా చేశాడో సినిమా చూశాక తనకు అర్థమైందని.. అందరూ గర్వపడే సినిమా వంశీ చేశాడని అల్లు అరవింద్ అన్నాడు. బన్నీ మాట్లాడుతూ వంశీ కోసం తాను చేసిన సాయం ఏదైనా ఉందంటే.. అది అతడిని తాను నమ్మడమే అని అన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఏ ప్రశంసలు దక్కినా.. ఇది ఎంత పెద్ద విజయం సాధించినా.. దాని తాలూకు క్రెడిట్ నూటికి నూరు శాతం వంశీకే చెందుతుందని.. తనకు కాదని అన్నాడు. నటీనటులు.. టెక్నీషియన్లు ఎంత బాగా పనిచేసినా దర్శకుతు తప్పు చేస్తే సినిమా పోతుందని.. అదే మిగతా వాళ్లు ఎన్ని తప్పులు చేసినా దర్శకుడు బాగా చేస్తే సినిమా ఆడుతుందని.. అందుకే దర్శకుడిని సినిమాకు కెప్టెన్ అంటారని బన్నీ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు