చరణ్-బన్నీ.. పోటీ పడిపోయారుగా

చరణ్-బన్నీ.. పోటీ పడిపోయారుగా

శ్రీరెడ్డి ఇష్యూ పుణ్యమో ఏమో.. ఇండస్ట్రీ జనాల్లో ఒక్కసారిగా ఎన్నడూ లేనంత స్నేహ భావం కనిపిస్తోంది. ఇంతకుముందు తమ మధ్య ఉన్న హద్దుల్ని చెరిపివేసి స్టార్ హీరోలందరూ ఒక్కటైపోతున్నారు. ఒకరినొకరు కలుస్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. వేదికలెక్కినపుడు ఇగోలు పక్కన పెట్టి వేరే వాళ్లను పొగుడుతున్నారు.

కొన్ని రోజుల కిందటే ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ అతిథిగా రావడం.. మహేష్‌తో కలిసి చాలా స్నేహంగా మెలగడం.. ఇద్దరూ ఒకరినొకరు పొగిడేసుకోవడం తెలిసిందే. తర్వాత ఎన్టీఆర్-చరణ్-మహేష్ కలిసి పార్టీ చేసుకుని ఫొటోలు కూడా దిగారు. ఇక తాజాగా ‘నా పేరు సూర్య’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్.. అల్లు అర్జున్ ఇద్దరూ కూడా ఏ భేషజం లేకుండా వేరే హీరోల గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడి ఆశ్చర్యపరిచారు.

కొన్నాళ్లుగా టీవీ ఛానెళ్లు సినీ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం గురించి స్పందిస్తూ.. తామేం పాపం చేస్తున్నాం అన్నట్లుగా మాట్లాడాడు చరణ్. సినిమాల కోసం తామెంత కష్టపడతామో వివరిస్తూ.. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బాలకృష్ణ వీళ్లందరి పేర్లూ గుర్తు చేశాడు. వీళ్లందరికీ గాయాలయ్యాయని.. సర్జరీలు చేసుకున్నారని.. అదంతా తనకు తెలుసని అన్నాడు. ఇంత కష్టపడే తమను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని ప్రశ్నించాడు. ఇలా ఈ హీరోలందరి అభిమానులనూ ఆకట్టుకున్నాడు చరణ్. మరోవైపు అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘రంగస్థలం’ వేసవికి మంచి ఆరంభాన్నిస్తే.. ‘భరత్ అనే నేను’ దాన్ని కొనసాగించిందని.. మహేష్ బాబు అండ్ టీంకు థ్యాంక్స్ అని అన్నాడు.

తన సినిమా తర్వాత ‘మహానటి’, ‘మెహబూబా’ సినిమాలు రాబోతున్నాయని.. ఆ చిత్రాలు విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు ఈ స్టార్లందరూ వేరే సినిమాల గురించి కానీ.. వేరే హీరోల గురించి కానీ మాట్లాడేందుకు ఇష్టపడేవాళ్లు కాదు. వాళ్లకు ఇగో అడ్డొచ్చేది. కానీ అలా ఉండటం వల్ల ఏ ప్రయోజనం లేదని.. అందరినీ కలుపుకుని పోతేనే మంచిదని ఆలస్యంగా గ్రహించి.. ఈ సుహృద్భావ వాతావరణాన్ని పెంచడానికి హీరోలు పోటీ పడుతుండటం మంచి పరిణామమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు