సినిమాలు ఫెయిలై ఉండొచ్చు కానీ.. హీరోలు ఫెయిల్ కాలేదు

సినిమాలు ఫెయిలై ఉండొచ్చు కానీ.. హీరోలు ఫెయిల్ కాలేదు

టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలామందితో సినిమాలు చేశాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తన స్థాయి దర్శకుల్లో వేరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో చాలా సినిమాలు చేశాడు. చాలామంది స్టార్లతో పని చేశాడాయన. ఐతే గత కొన్నేళ్లలో క్వాంటిటీ తప్ప క్వాలిటీ లేకపోయింది పూరి సినిమాల్లో. ఇలాంటి తరుణంలో తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ‘మెహబూబా’ను తెరకెక్కించాడు.

తన కొడుకు పూరి ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన తీసిన ఈ చిత్రం మే 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి దీని తర్వాత పూరి ఎవరితో సినిమా చేయబోతున్నాడు.. ఆయన కోసం ఏ స్టార్ హీరో రెడీగా ఉన్నాడు.. అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఐతే పూరి ‘మెహబూబా’ తర్వాత కూడా వేరే హీరోతో సినిమా చేయడట. తన కొడుకునే హీరోగా పెట్టి సినిమాలు తీస్తాడట. అవి కూడా తన సొంత బేనర్లోనే తెరకెక్కుతాయట.

ఆకాశ్‌ను ఒక సినిమాతో వదిలేయలేనని.. అతడితో ఇంకో రెండు సినిమాలు తీస్తానని.. అవి రెండూ ఒక దాని తర్వాత ఇంకొకటి ఈ ఏడాదే మొదలవుతాయని పూరి స్పష్టం చేశాడు. ఇంకో రెండు సినిమాలు తీస్తే ఆకాశ్ హీరోగా కుదురుకుంటాడని.. ఆ తర్వాత అతడితో తనకు సంబంధం లేదని.. ఎవరితో సినిమాలు చేసుకుంటాడో తన ఇష్టమని పూరి చెప్పడం విశేషం. బయటి బేనర్లలో తీస్తే తనకు అచ్చి రావడం లేదని.. కంఫర్ట్ మిస్సవుతున్నట్లు అనిపిస్తోందని.. అందుకే ఇకపై తాను సొంత బేనర్లలోనే సినిమాలు చేయాలని డిసైడయ్యానని పూరి స్పష్టం చేశాడు.

తనతో పని చేయడానికి ఇప్పుడు కూడా స్టార్లు రెడీగానే ఉన్నారని.. తాను ఎవరిని అడిగినా కాదనరని పూరి అన్నాడు. తన సినిమాలు ఫెయిలై ఉండొచ్చు కానీ.. తన సినిమాల్లో పని చేసిన హీరోలు ఫెయిల్ కాలేదని.. వాటితో వాళ్లు చాలా మంచి పేరే సంపాదించారని.. వాళ్లకు ఆ సినిమాలు ప్లస్ అయ్యాయని పూరి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు