దాసరి పుట్టిన రోజు.. భారీ హంగామానే

దాసరి పుట్టిన రోజు.. భారీ హంగామానే

దర్శక రత్న దాసరి నారాయణ రావు వెళ్లిపోయి ఏడాది దాటింది. ఈ ఏడాదిలో ఆయన పేరును సినీ పరిశ్రమ పలుమార్లు తలుచుకుంది. ఇక్కడ ఏ పెద్ద సమస్య తలెత్తినా అయ్యో ఇప్పుడు దాసరి ఉంటేనా అన్న నిట్టూర్పు అందరిలోనూ కనిపించింది. అందులోనూ శ్రీరెడ్డి ఇష్యూ రెండు నెలలుగా సినీ పరిశ్రమను కుదిపేస్తున్న నేపథ్యంలో దాసరి చర్చ మరింత ఎక్కువైంది. దాసరి అంటే పడని వాళ్లు సైతం ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మీద గౌరవం ఎన్నో రెట్లు పెరిగిందనడంలో సందేహం లేదు. ఇలాంటి తరుణంలోనే దర్శకరత్న జయంతి వస్తోంది. మే 4న దాసరి పుట్టిన రోజు కావడం విశేషం.

ఈ నేపథ్యంలో దాసరికి పెద్ద గౌరవాన్ని కట్టబెడుతోంది సినీ పరిశ్రమ. ఈ రోజును డైరెక్టర్స్ డేగా ప్రకటించనున్నారు. ఇకపై ప్రతి ఏడాదీ ఈ రోజును డైరెక్టర్స్ డేగా పెద్ద ఎత్తున జరపబోతున్నారు. అందులోనూ ఈ సంవత్సరం దాసరి జయంతిని అంగరంగ వైభవంగా చేయడానికి పరిశ్రమ మొత్తం కదిలి రాబోతోంది. ఫిలిం ఛాంబర్లో దాసరి విగ్రహాన్ని కూడా పెడుతున్నారు. ఆయన శిష్యుల్లో ఒకరైన సి.కళ్యాణ్ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చాడు.

ఇండస్ట్రీ మరో మాట లేకుండా ఆ ప్రతిపాదనను ఆమోదించింది. ప్రస్తుతం సినీ పరిశ్రమ పెద్ద సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో సరిహద్దులు చెరిపివేసి అందరూ ఒక్కటవుతున్నారు. తమ ఐకమత్యాన్ని చాటాల్సిన అవసరాన్ని గుర్తించి కలిసి సాగడానికి ముందుకు వస్తున్నారు. ఇందుకు దాసరి జయంతి వేడుకలు మంచి వేదిక అవుతాయని భావిస్తున్నారు. అందుకే ఎవరికి వాళ్లు ఈ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. దీన్ని విజయవంతం చేయడానికి భారీగానే సన్నాహాలు చేస్తున్నారు.