మన బాక్సాఫీస్‌పై ఆ సినిమా దాడి

మన బాక్సాఫీస్‌పై ఆ సినిమా దాడి

అనుకున్నదే అయింది. ఇండియన్ బాక్సాఫీస్ మీద హలీవుడ్ మూవీ ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’ దాడి మామూలుగా లేదు. భాష.. ప్రాంత భేదాలు లేకుండా ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఏడాది రిలీజైన బాలీవుడ్ సినిమాలన్నింటికంటే తొలి రోజు ‘ఎవెంజర్స్’కే అత్యధిక వసూళ్లు రావడం విశేషం. ఈ చిత్రం శుక్రవారం ఏకంగా రూ.32 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. దీంతో రూ.25 కోట్లతో ‘బాగి-2’ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. ‘పద్మావతి’ రూ.19 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఒక హాలీవుడ్ సినిమా బాలీవుడ్ చిత్రాల్ని మించి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అనూహ్యమైన విషయం. గతంలో ‘అవతార్’.. ‘జంగిల్ బుక్’ లాంటి సినిమాలకు కూడా మంచి హైపే వచ్చింది కానీ.. మరీ ఈ స్థాయిలో మాత్రం కాదు. అన్ని భాషల ప్రేక్షకులూ ఈ సినిమా మీద అమితాసక్తి చూపించారు.

ఈ వారాంతంలో విడుదలైన మిగతా భాషల చిత్రాలన్నీ దాని ముందు నిలవలేకపోయాయి. మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్స్‌ తో రన్ అవుతోంది. వీకెండ్లో ఈ చిత్రానికి టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. వారాంతంలోనే ఈ చిత్రం రూ.100 కోట్లకు చేరువుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఫుల్ రన్లో రూ.200 కోట్ల మార్కును కూడా అందుకునే ఛాన్సుంది. మామూలుగా సూపర్ హీరో సినిమా అంటేనే పిల్లలు అమితాసక్తి చూపిస్తారు. ఇక ఈ చిత్రంలో అరడజను మందికి పైగా సూపర్ హీరోలున్నారు. వాళ్లందరూ కలిసి విన్యాసాలు చేస్తుంటే ఇక పిల్లల ఆనందానికి హద్దులేముంది? పిల్లలనే కాదు. ఈ ఫాంటసీ మూవీని పెద్ద వాళ్లు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు