మావయ్య పోసాని.. మేనల్లుడు కొరటాల

మావయ్య పోసాని.. మేనల్లుడు కొరటాల

కొరటాల శివ.. పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడినపుడల్లా ఆయన్ని గురువు అనే సంబోధిస్తుంటాడు. పోసాని కొరటాల ప్రస్తావన తెచ్చినా అతడిని తన శిష్యుడన్నట్లే మాట్లాడతాడు. నిజానికి వీళ్లిద్దరిదీ మామ-మేనల్లుడు బంధం. ఈ విషయాన్ని ఎప్పుడూ పెద్దగా చెప్పుకోరు. గురుశిష్యుల్లాగే మెలుగుతుంటారు. ఐతే ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్లో తమ రక్తసబంధం గురించి వీళ్లు ఓపెనయ్యారు. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా కొరటాల గురించి పోసాని భలే మాట్లాడాడు. తన పెళ్లిచూపులకు కొరటాలనే తాను తోడు తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. ఈ విషయం చెప్పినపుడు మహేష్ చాలా ఆసక్తిగా విన్నాడు. కొరటాల టేస్టు మీద తనకు చిన్నప్పట్నుంచే మంచి గురి ఉండేదని.. అందుకే తాను అతడిని పెళ్లిచూపులకు తోడుగా తీసుకెళ్లానని పోసాని చెప్పాడు.

అమ్మాయిని చూసి బయటికి వచ్చాక ఎలా ఉందిరా అని అడిగితే.. మామా అమ్మాయి భలే ఉంది చేసేసుకో అన్నాడని పోసాని చెప్పాడు. అప్పుడు మహేష్.. కొరటాల సహా అందరూ పగలబడి నవ్వారు. కొరటాల సగం నమ్మకం.. చూసిన అమ్మాయి మీద సగం నమ్మకంతో ఆమెనే తాను పెళ్లి చేసుకున్నానని పోసాని చెప్పాడు. ఇండస్ట్రీలోకి వచ్చి కొరటాల చాలా సంపాదించాడని చాలామంది అనుకుంటారని.. కానీ అతను చాలా పోగొట్టుకున్నాడని పోసాని అన్నాడు. అతడి కథల్ని వేరేవాళ్లు కొట్టేయకపోతే ఇప్పటికే పది బ్లాక్ బస్టర్లు తీసేవాడని చెప్పాడు. ఆ తర్వాత కొరటాల మాట్లాడుతూ.. తాను మాటలు ఎలా రాయాలి.. కథ ఎలా రాయాలి అన్నది తన గురువు పోసానిని చూసే నేర్చుకున్నట్లు చెప్పాడు. పోసాని దగ్గర శిష్యరికం చేసినపుడు ఆయన సన్నివేశం చెబుతుంటే రికార్డ్ చేసుకుని రాత్రికి సీన్లు రాసేవాళ్లమని.. మధ్యలో అక్కడక్కడా తమ సొంత మాటలు జోడించేవాళ్లమని.. ఆ మాటలు సినిమాలో ఉంటే సంబరపడిపోయేవాడినని.. అలాంటిదిప్పుడు ఆయనకే మాటలు రాసే అవకాశం వచ్చిందని అన్నాడు కొరటాల. ముందు గురువు గురువు అంటూనే చివర్లో పోసానిని కొరటాల మావయ్య అని కొరటాల సంబోధించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు