కొరటాల ఎమ్మెల్యే అవుతాడా?

కొరటాల ఎమ్మెల్యే అవుతాడా?

‘భరత్ అనే నేను’ సినిమా చూస్తే దర్శకుడు కొరటాల శివకు రాజకీయ వ్యవహారాలపై బాగానే అవగాహన ఉన్న విషయం అర్థమవుతుంది. మామూలుగా చాలా మంది దర్శకులు సినిమాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినపుడు జనరలైజ్డ్ ఒపీనియన్స్ ప్రకారం సన్నివేశాలు లాగించేస్తుంటారు. అవి సిల్లీగా తయారవుతుంటాయి. లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లతో సినిమాలు తీసినప్పటికీ ఎంతో కొంత వాస్తవానికి దగ్గరగా సన్నివేశాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

కొరటాల ‘భరత్ అనే నేను’ విషయంలో అదే చేశాడనిపిస్తుంది. అతను చూపించిన పాత్రలు.. సన్నివేశాలు జనాలు రిలేట్ చేసుకునేలాగే ఉన్నాయి. ఈ విషయాన్నే తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కలిసి పాల్గొన్న ఓ చర్చా కార్యక్రమంలో మహేష్ ప్రస్తావించాడు. తనకు రాజకీయాల గురించి ఏమీ అవగాహన లేదని.. కానీ కొరటాల మాత్రం అలా కాదని.. ఆయనకు అపారమైన పరిజ్ఞానం ఉందని మహేష్ చెప్పాడు.

రాజకీయాల నేపథ్యంలో సినిమా.. పైగా సీఎం పాత్ర అనగానే తాను చాలా భయపడ్డానని.. కానీ కొరటాల చాలా బాగా ఈ పాత్ర గురించి.. రాజకీయాల గురించి వివరించి ఈ సినిమా చేయించాడని మహేష్ బాబు చెప్పాడు. ఒక సందర్భంలో కొరటాల తనతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కావాలన్న కోరిక తనకు ఉన్నట్లుగా వెల్లడించినట్లు మహేష్ చెప్పడం విశేషం. కొరటాలకు ఆ కోరిక ఉందంటే.. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ పడినా పడొచ్చేమో.

ఇప్పటికే తన ప్రతి సినిమాలోనూ ఎంతో కొంత మంచి చెప్పడానికి ప్రయత్నించడం ద్వారా కొరటాల జనాల్లో మంచి పేరు సంపాదించాడు. తన ఇంటర్వ్యూల్లో కూడా రాజకీయాలు.. సమాజం గురించి తరచుగా మాట్లాడుతుంటాడు కొరటాల. మున్ముందు దర్శకుడిగా.. వ్యక్తిగా ఇదే ఇమేజ్ కొనసాగించి.. మరింత మంచి పేరు సంపాదిస్తే.. ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేసి జనాల మనసులు గెలిచి.. ఎమ్మెల్యే కూడా అయినా అవుతాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు