అజిత్‌కు విశాల్ కౌంటర్

అజిత్‌కు విశాల్ కౌంటర్

కోలీవుడ్లో ఉద్ధండ పిండాలెందరో ఉన్నప్పటికీ తెలుగువాడైన విశాల్ అక్కడ ఎలా ఆధిపత్యం సాగిస్తున్నాడో తెలిసిందే. శరత్ కుమార్ అండ్ కోను ఎదిరించి నడిగర్ సంఘం ఎన్నికల్లో తన బృందాన్ని గెలిపించుకుని హీరో అయ్యాడతను. ఆ తర్వాత నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసి దానికీ అధ్యక్షుడయ్యాడు. ఇటీవలే తమిళ సినీ పరిశ్రమ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నెలన్నర పాటు సమ్మె నడిపించి.. పలు సమస్యలకు పరిష్కార మార్గం కనిపెట్టిన ఘనత కూడా అతడిదే. ఈ ఉద్యమాన్ని అతను నడిపించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం తమిళంలో ఎప్పడు ఏ సినిమా రిలీజవ్వాలనే నిర్ణయం కూడా విశాల్ కమిటీ చేతుల మీదుగా నడుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని.. ఆరు నెలల తర్వాత దేశంలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా కోలీవుడ్ నిలుస్తుందని విశాల్ చెప్పడం విశేషం.

ఇక కోలీవుడ్‌కు సంబంధించి పలు అంశాలపై విలేకరులతో మాట్లాడిన అతను అక్కడి స్టార్ హీరోలు విజయ్, అజిత్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ తమిళ పరిశ్రమలో పోరాడి గెలిచిన హీరో అని కితాబిచ్చాడు. డ్యాన్స్ విషయంలో విజయ్‌తో ఎవ్వరూ పోటీ పడలేరన్నాడు. ఇక అజిత్ గురించి మాట్లాడుతూ.. ఆయనలో చాలా మంచి లక్షణాలున్నాయన్నాడు. ఐతే ఒకే ఒక్క విషయం మాత్రం అజిత్‌లో తనకు నచ్చదని... ఆయన ఎప్పుడూ ఎవరికీ అందుబాటులో ఉండరని అన్నాడు విశాల్. కోలీవుడ్‌కు సంబంధించిన అంశాలపై మాట్లాడాల్సి వచ్చినపుడల్లా అజిత్‌ను చేరుకోవడం చాలా కష్టమైందట. అందుకే ఈ కౌంటర్ వేశాడు విశాల్. తనను వివిధ అంశాల్లో ఎంతోమంది విమర్శించినప్పటికీ.. తమిళ సినీ పరిశ్రమ మంచిని దృష్టిలో ఉంచుకుని ఏదీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నానని విశాల్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు