విశాల్ సినిమా.. రిలీజ్ డ్రామాకు తెర

విశాల్ సినిమా.. రిలీజ్ డ్రామాకు తెర

తమిళనాట నెలన్నర పాటు సాగిన సమ్మెకు కొన్ని రోజుల కిందటే తెరపడిన సంగతి తెలిసిందే. ఈ నెలన్నరలో షెడ్యూల్ అయిన చాలా సినిమాలు ఆగిపోవడం.. కొత్త సినిమాలు కూడా చాలానే రేసులోకి రావడంతో రిలీజ్ డేట్ల విషయంలో తమిళ నిర్మాతల మండలి ఒక కమిటీ వేసి రెగ్యులేట్ చేయాలని నిర్ణయించింది.

సమ్మె సందర్భంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ తన టీంతో కలిసి.. వచ్చే రెండు నెలల్లో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ కావాలో డిసైడ్ చేస్తున్నాడు. రేసులో అతడి సినిమా ‘ఇరుంబు తురై’ (తెలుగులో అభిమన్యుడు) కూడా ఉండటంతో దాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. విశాల్ మే 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అదే తేదీ కోసం ఇంకో రెండు మూడు సినిమాలు రేసులో నిలిచాయి.

దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. విశాల్ తన డిస్ట్రిబ్యూటర్లకు మే 11న రిలీజ్ అనే సంకేతాలిచ్చేసి.. నిర్మాతల మండలిలో చర్చల తర్వాత డేట్ ప్రకటిద్దామని చూశాడు. ఇంతలో డిస్ట్రిబ్యూటర్లు డేట్ ప్రకటించేయడంతో దుమారం రేగింది. విశాల్ ఈ విషయాన్ని ఖండించాల్సి వచ్చంది. ఇంకా నిర్మాతల మండలిలో చర్చించలేదని.. అంత వరకు ఆగాలని చెప్పాడు.

మిగతా నిర్మాతల్ని ఎలా మేనేజ్ చేశాడో కానీ.. మే 11కు తన సినిమాను ఖరారు చేసుకున్నాడు. ఈ సమ్మర్లో దీనికి మించిన మంచి రిలీజ్ డేట్ ఉండదని.. సమ్మె తర్వాత రాబోయే పెద్ద సినిమా ఇదే కావడంతో దీనికి ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని.. విశాల్ తెలివిగా నరుక్కొచ్చి.. వేరే సినిమాల్ని పక్కకు పంపించేశాడని కోలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఐతే పరిశ్రమ కోసం అంత కష్టపడుతున్న విశాల్ ఈ మాత్రం ప్రయోజనం పొందితే తప్పేంటనేవాళ్లూ లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు