రాజశేఖర్ మంచి రూట్లోనే ఉన్నాడు

రాజశేఖర్ మంచి రూట్లోనే ఉన్నాడు

‘గరుడవేగ’ అనే సినిమా రిలీజ్ కావడానికి ముందు దశాబ్ద కాలంలో రాజశేఖర్ పరిస్థితి ఏంటో తెలిసిందే. ఒక దశలో రాజశేఖర్ అనే హీరో తెలుగులో ఒకరున్నారన్న సంగతే జనాలు మరిచిపోయారు. అలాంటి సమయంలో ‘గరుడవేగ’ లాంటి వైవిధ్యమైన.. గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీలో నటించి మెప్పించాడీ సీనియర్ హీరో. ఈ దశలో రాజశేఖర్ ఇలాంటి కథను ఎంచుకోవడం గొప్ప విషయమే. ఈ చిత్రం కమర్షియల్‌గా ఎంత పెద్ద విజయం సాధించిందన్నది పక్కన పెడితే.. రాజశేఖర్ కెరీర్‌కు మాత్రం మళ్లీ ఊపు తెచ్చింది. ఆయన సినిమా చూడ్డానికి మళ్లీ జనాలు థియేటర్లకు రావడమే పెద్ద విజయంగా భావించాలి. ఈ సినిమా తెచ్చిన గుర్తింపును రాజశేఖర్ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు. వచ్చిన పేరు పోకుండా ఉండేందుకు ఎదురు చూశాడు.

మళ్లీ ‘గరుడవేగ’ లాంటి వైవిధ్యమైన సినిమా చేయడానికే నిర్ణయించుకున్న రాజశేఖర్.. ‘అ!’ సినిమాతో ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఓ కొత్త తరహా సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో పాటు మరో ప్రాజెక్టు కూడా ఓకే అయిందట. అది కూడా భిన్నంగానే ఉంటుందట. తన కొత్త సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయని.. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని రాజశేఖర్ చెప్పాడు. ప్రశాంత్‌తో సినిమా చేయాలన్న నిర్ణయమే రాజశేఖర్ ట్రెండీగా ఆలోచిస్తున్నాడని.. సరైన దారిలోనే ప్రయాణిస్తున్నాడని అనడానికి నిదర్శనంగా చెబుతున్నారు విశ్లేషకులు. ‘అ!’ సినిమాతో తన రూటే వేరని చాటిచెప్పాడు ప్రశాంత్. అలాంటి మరో వైవిధ్యమైన సినిమాలో రాజశేఖర్ కనిపిస్తే దీనికి మంచి క్రేజే వస్తుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English