‘యన్.టి.ఆర్’ బాంబులు ఎప్పుడు పేలుతాయో..

‘యన్.టి.ఆర్’ బాంబులు ఎప్పుడు పేలుతాయో..

అట్టహాసంగా మొదలైన ‘యన్.టి.ఆర్’ సినిమా విషయంలో అనూహ్య పరిణామం జరిగింది. ఈ చిత్రం నుంచి దర్శకుడు తేజ తప్పుకోవడం పెద్ద షాకే. ముందు ఇది రూమర్ అయి ఉంటుందని అనుకున్నారు. కానీ అది నిజమే అని తర్వాత తేలింది. నిజానికి ముక్కుసూటిగా ఉండే బాలయ్య-తేజల మనస్తత్వాల ప్రకారం వీళ్లిద్దరూ కలిసి ఎన్టీఆర్ బయోపిక్ చేయబోతున్నారంటేనే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ వార్తను నమ్మడానికి ఇష్టపడలేదు. ఐతే తర్వాత అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా కూడా మొదలైంది. కానీ ప్రారంభోత్సవం జరిగిన నెల తిరక్కుండానే సినిమా నుంచి తేజ తప్పుకున్నాడు. స్క్రిప్టు విషయంలో బాలయ్య అండ్ టీం జోక్యం ఎక్కువైపోవడం.. పాత తరహా ఆలోచనల్ని జొప్పించే ప్రయత్నం చేస్తుండటంతో తట్టుకోలేక తేజ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడని అంటున్నారు.

ఐతే అంతర్గత కారణాలు ఏవైనప్పటికీ తేజ మాత్రం ప్రస్తుతానికి హుందాగానే స్పందించాడు. ఈ చిత్రానికి తాను న్యాయం చేయలేననే భావనతోనే బయటికి వచ్చినట్లు చెప్పాడు. మరి దీనిపై బాలయ్య ఏమంటాడో చూడాలి. ఐతే భవిష్యత్తులో ఈ పరిణామానికి సంబంధించి బాంబులు పేలకుండా ఉండవు. తేజ చాలా ముక్కుసూటి మనిషి. వెంటనే బాలయ్యను ఏమైనా అంటే బాగోదని ఆగినట్లున్నాడు. కానీ తన తర్వాతి సినిమా ప్రమోషన్లకు వచ్చినపుడో.. ఏదైనా యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినపుడే వాస్తవాలు మాట్లాడకుండా పోడు. తనతో సినిమా చేసిన మహేష్ బాబును విమర్శించడానికే తేజ వెనుకాడలేదు. బాలయ్యను మాత్రం వదిలేస్తాడని అనుకోలేం. ఇక తానెంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టును ఇలా అర్ధంతరంగా వదిలేసి వెళ్లిపోయిన తేజ మీద బాలయ్యకు కోపం లేకుండా ఉండదు. బాలయ్యకు మామూలుగానే అహం ఎక్కువ. కాబట్టి బాలయ్యను మీడియావాళ్లు కెలికితే ఆయనా ఫైర్ అవ్వకుండా ఉండడు. ముక్కుసూటితనంలో ఎవరికి ఎవరూ తీసిపోరు కాబట్టి భవిష్యత్తులో ఈ విషయమై మాటల దాడి గట్టిగానే ఉండొచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English