పూజా హెగ్డే.. టాలీవుడ్డే బెటరమ్మా

పూజా హెగ్డే.. టాలీవుడ్డే బెటరమ్మా

తెలుగులో పూజా హెగ్డే చేసిన తొలి రెండు సినిమాలు ‘ఒక లైలా కోసం’.. ‘ముకుంద’ ఆశించిన ఫలితాన్నేమీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమెకు ఇక్కడ మంచి క్రేజే వచ్చింది. ఆమె అందచందాలు తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. తొలి రెండు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఇక్కడ అవకాశాలు తలుపు తట్టాయి. కానీ ఆమె మాత్రం బాలీవుడ్లో ‘మొహెంజదారో’ కోసం బల్క్ డేట్లు ఇచ్చేసి ఇక్కడి అవకాశాల్ని తిరస్కరించింది. ఐతే రెండేళ్ల పాటు ఆ సినిమా కోసం పడ్డ కష్టమంతా వృథా అయింది. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ అయింది. పూజ కెరీర్లో విలువైన రెండేళ్లు వృథా అయ్యాయి. అయినప్పటికీ టాలీవుడ్‌ ఆమెకు మళ్లీ మంచి అవకాశాలే ఇచ్చింది. ‘దువ్వాడ జగన్నాథం’ ఫ్లాప్ అయినా సరే.. పూజకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

దీంతో తెలుగులో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశం అందుకుంది పూజా. అందులో మహేష్ బాబు సినిమా కూడా ఉండటం విశేషం. ఐతే ఇక్కడ కెరీర్ మాంచి రైజింగ్‌లో ఉండగా పూజ మళ్లీ బాలీవుడ్ వైపు చూస్తుండటం గమనార్హం. హౌస్‌ఫుల్ సిరీస్‌లో భాగంగా రాబోతున్న కొత్త సినిమాలో పూజ కథానాయికగా నటించనుందట. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు ఇంకో నలుగురైదుగురు హీరో హీరోయిన్లు కీలక పాత్రలు చేయబోతున్నారు. ఐతే ఇంతమంది మధ్యన పూజ ఏం ప్రత్యేకత చాటుకుంటుందన్నది సందేహం. ఇలాంటి మల్టీస్టారర్లలో ఎవరికీ అంత పేరు రాదు. అందులోనూ పూజ బాలీవుడ్లో ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ కూడా కాదాయె. కాబట్టి గుంపులో గోవిందా తరహాలో తయారవుతుందేమో పరిస్థితి. బేసిగ్గా ముంబయి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి బాలీవుడ్ సినిమాలో అవకాశం వస్తే కాదనలేక సినిమా చేస్తోందేమో. కానీ హీరోయిన్‌గా టాలీవుడ్ పూజకు ఇచ్చిన ప్రాధాన్యం మరెక్కడా దక్కదనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు