నడిచే సైనికుడా? నడిపించే నాయకుడా?

నడిచే సైనికుడా? నడిపించే నాయకుడా?

ప్రస్తుతం రకరకాల వివాదాల్లో మునిగి ఉన్న టాలీవుడ్ లో అందరి నోటి వెంట వస్తున్న మాట... దాసరి నారాయణరావు తరవాత ఇండస్ట్రీ పెద్దదిక్కును కోల్పోయింది అని. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది పెద్ద మనుషులు ఉన్నా వాళ్లు కొన్ని వర్గాలనో.. కొంతమంది వ్యక్తులనో ప్రభావితం చేయగలరు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు మొత్తం ఇండస్ట్రీని ఒకతాటిపై నడిపించేది ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

చాలామంది మెగాస్టార్ చిరంజీవి ఈ ప్లేసును తీసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే ముందుతరంలో నలుగురు టాప్ హీరోల్లో నెం. 1 పొజిషన్ చిరంజీవిదే. నటనాపరంగానూ మిగతా ముగ్గురి కన్నా సీనియర్. దాసరిలాగే చిరంజీవికి దర్శకుడిగా.. నిర్మాతగా విశేష అనుభవముంది. టాలీవుడ్ లో అత్యధిక హీరోలున్న మెగా కాంపాండ్ లో చిరు మాట అంటే ఓ రకంగా వేదవాక్కు లాంటిదే. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ మెగా ఫ్యామిలీకి గట్టి పట్టే ఉంది. మీడియా ఛానళ్లతో నెలకొన్న వివాదం నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ లో అందరు హీరోల సమావేశం జరిగింది. దీని వెనుక ఉండి.. దానిని లీడ్ చేసింది చిరంజీవియేనని అందుకని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మెగాస్టారే కరెక్టనే వాదన ఉంది.

పొలిటికల్ గా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులే నాయకత్వానికి చిరంజీవి ముందుకు రాకపోవడానికి కారణమనే మాట కూడా వినిపిస్తోంది. చిరంజీవి నిన్న మొన్నటివరకు కాంగ్రెస్ ప్రతినిధిగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లిపోయాడు. మరోవైపు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం జనసేనకు.. తెలుగుదేశానికి అస్సలు పొసగడం లేదు. అందుకే హీరోల మీటింగ్ కు బాలకృష్ణ హాజరు కాలేదు. మెగా ఫ్యామిలీని నందమూరి ఫ్యామిలీ విబేధిస్తే చిరంజీవి మాట మళ్లీ కొన్ని వర్గాలకే పరిమితమైపోతుంది. ఇదంతా ఎందుకని నాయకత్వానికి చిరు దూరంగా ఉండటానికి మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. ముందుముందు కాలమెలా మారుతోందో.. చిరు ఆలోచన ఎలా మారుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు