వాయిస్ కూడా ఎలా దించేశాడబ్బా..

వాయిస్ కూడా ఎలా దించేశాడబ్బా..

నిన్నట్నుంచి భారతీయ సినీ వర్గాల్లో ‘సంజు’ టీజర్ గురించే చర్చ. మున్నాభాయ్ సిరీస్ మొదలుకుని.. ‘3 ఇడియట్స్’, ‘పీకే’ లాంటి అద్భుత చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచిన రాజ్ కుమార్ హిరాని.. తన మిత్రుడైన సంజయ్ దత్ జీవిత కథను ఎలా తీసి ఉంటాడు.. అతడిని మంచి వాడిగా ప్రొజెక్ట్ చేస్తాడా.. అలా చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే సందేహాలు చాలానే ఉండేవి ఇంతకాలం.

ఐతే చాలా వరకు వాస్తవానికి దగ్గరగానే సంజు జీవితాన్ని చూపిస్తున్నాడని.. అతడి కథను చాలా ఆసక్తికరంగా, వైవిధ్యంగా చెప్పే ప్రయత్నం చేశాడని దీని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్ చూసిన వాళ్లందరూ ఫిదా అయిపోయారు. సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది ఈ టీజర్.

టీజర్ చూశాక రాజ్ కుమార్ హిరానికి ఏ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయో సంజయ్ దత్ పాత్ర పోషించిన రణబీర్ కపూర్‌కు కూడా అదే స్థాయిలో అప్లాజ్ వస్తోంది. రణబీర్ ఇంత బాగా సంజు పాత్రలో ఒదిగిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు. చాలా చోట్ల సంజయ్ దత్‌ను చూస్తున్నట్లే అనిపించింది. సంజు జీవితంలోని వివిధ దశలకు తగ్గట్లుగా రణబీర్ తనను తాను మలుచుకున్న తీరు.. ఆ బాడీ లాంగ్వేజ్.. ఆ మేకప్.. అన్నీ కూడా మెస్మరైజ్ చేశాయి. సంజయ్ బాగా చిన్న వయసులో ఉన్న ఒక్క లుక్ (టీషర్టుతో ఉన్నది) మినహాయిస్తే అన్నింట్లోనూ పర్ఫెక్ట్‌గా కనిపించాడు రణబీర్.

సంజయ్ నడకను.. అతడి బాడీ లాంగ్వేజ్‌ను పర్ఫెక్ట్‌గా అనుకరించడం ఒక ఎత్తయితే.. చివరికి సంజు వాయిస్‌ను సైతం రణబీర్ చాలా బాగా ఇమిటేట్ చేయడం.. అచ్చం దత్ వాయిస్ వింటున్న భావనే కలిగించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఎలా సాధ్యమైందో అతడికి.. హిరానికే తెలియాలి. ఒంటిని మార్చుకుని.. మేకప్ ద్వారా ఏమైనా చేయొచ్చేమో కానీ.. ఒక అగ్ర నటుడి పాత్ర పోషిస్తూ మరో మరో టాప్ స్టార్ వాయిస్‌ను కూడా పక్కాగా అనుకరించడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు