చైతూ సినిమా బాలీవుడ్‌కు వెళ్తోంది

చైతూ సినిమా బాలీవుడ్‌కు వెళ్తోంది

సౌత్ సినిమాను బాలీవుడ్ వాళ్లు చిన్న చూపు చూసే రోజులు పోయాయి. ఇక్కడి సినిమాలు అక్కడి వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. బాలీవుడ్లో కథలు కరవైపోయి దక్షిణాదిన ఏ మంచి సినిమా వచ్చినా అక్కడ రీమేక్ చేసేస్తున్నారు. తెలుగు సహా పలు దక్షిణాది భాషల నుంచి గత కొన్నేళ్లలో చాలా సినిమాలు బాలీవుడ్‌కు వెళ్లాయి. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసేందే. తెలుగు వెర్షన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోయే ఈ చిత్రం అర్జున్ కపూర్ కథానాయకుడిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. అదే హీరో త్వరలోనే మరో సౌత్ రీమేక్‌లో నటించబోతుండటం విశేషం. ఆ సినిమా మరేదో కాదు.. ప్రేమమ్.

నివీన్ పౌళీ హీరోగా అల్ఫాన్సో పుతెరిన్ రూపొందించిన ‘ప్రేమమ్’ సౌత్ ఇండియన్ ఆల్ టైం క్లాసిక్స్ ‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా.. తెలుగులోనూ ఆ చిత్రం విజయవంతమైంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ‘రాక్ ఆన్’.. ‘కై పో చే’ లాంటి సినిమాలు రూపొందించిన యువ దర్శకుడు అభిషేక్ కపూర్ ‘ప్రేమమ్’ రీమేక్‌ను రూపొందించబోతున్నాడు. ఐతే దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన ఏ కథా అదే తరహాలో తెరకెక్కదు. దాన్ని అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు చాలా మార్చేస్తారు. ఇటీవలే ‘క్షణం’ సినిమాను ‘బాగి-2’గా ఎలా మార్చారో తెలిసిందే. మరి ‘ప్రేమమ్’ లాంటి క్లాసిక్ బాలీవుడ్లో ఎలాంటి రూపం సంతరించుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు