దాసరి లేడు.. దాసరి లేడు.. తీసుకోవచ్చుగా

దాసరి లేడు.. దాసరి లేడు.. తీసుకోవచ్చుగా

ఒక వ్యక్తి వెళ్లిపోయాక అతడు లేని లోటును ఎక్కువమంది ఫీలవుతుంటే ఆ వ్యక్తి గొప్పవాడికిందే లెక్క. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం దాసరి నారాయణరావు లేని లోటును బాగా ఫీలవుతోంది. ఇండస్ట్రీలో ఏ సమస్య తలెత్తినా దాసరి లేరే అన్న మాటలు వినిపిస్తున్నాయి. కేవలం ఇండస్ట్రీ జనాలు మాత్రమే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం ఇదే భావనతో ఉండటం ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తోంది. గత ఏడాది డ్రగ్స్ కుంభకోణంపై రచ్చ జరిగినపుడు దాసరి లేని లోటు బాగా కనిపించింది. ఇప్పుడు మరీ ముఖ్యంగా శ్రీరెడ్డి ఇష్యూ మీద పెద్ద గొడవ నడుస్తున్న నేపథ్యంలో దాసరి లేని లోటుపై పలువురు స్పందిస్తున్నారు. అయ్యో దాసరి లేడే అనేస్తున్నారు. కానీ ఆ మాట్లాడున్న వాళ్లు కానీ.. వాళ్ల కుటుంబాల్లోని పెద్దలు కానీ దాసరి స్థానాన్ని భర్తీ చేయడానికి మాత్రం ముందుకు రారు.

ఉదాహరణకు తాజాగా అల్లు శిరీష్ దాసరి లేని లోటు గురించి మాట్లాడారు. మరి శిరీష్ తండ్రి అరవింద్ ఇండస్ట్రీ పెద్దే కదా. మరి ఆయన దాసరి బాధ్యత తీసుకోవచ్చు కదా? అంతకుముందు సీనియర్ నటుడు నరేష్.. దాసరి గురించి మాట్లాడారు. ఆయనే ఈ బాధ్యత చేపట్టొచ్చు కదా? లేదా కృష్ణ కుటుంబ సభ్యులు ముందుకు రావచ్చు కదా? మోహన్ బాబు కూడా తరచుగా తన గురువు లేని లోటు గురించి స్పందిస్తుంటారు. మరి ఆయనే బాద్యత తీసుకోవచ్చు కదా? ఆలీ కూడా ఒకసారి దాసరి గురించి మాట్లాడారు. మరి ఆయన మిత్రుడు.. రాజకీయ నేత కూడా అయిన పవన్ కళ్యాణ్ ను పెద్ద మనిషి పాత్ర పోషించవచ్చని చెప్పొచ్చు కదా? కానీ ఎవరూ చెప్పరు. ఎవరూ బాధ్యత తీసుకోరు. ఎందుకంటే అది ఒక ముళ్ల కిరీటం. తమ పనులు మానుకుని.. ఎన్నో తలనొప్పులు నెత్తికెత్తుకోవాలి. బాధ్యతలు చూడాలి. ఇది అందరికీ బరువులా అనిపిస్తుంది. మనకెందుకొచ్చిన గొడవ అనిపిస్తుంది. కానీ దాసరి అలా ఎప్పుడూ అనుకోలేదు. అందరి సమస్యల్ని తన సమస్యలుగా భావించాడు. అందరి కోసం పని చేశాడు. మధ్యలో చిరంజీవి.. సురేష్ బాబు లాంటి వాళ్లు కొన్ని చర్యల ద్వారా దాసరి స్థానాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. కానీ నిలకడగా ఆ బాధ్యతను నిర్వర్తించడం అంత సులువు కాదు కాబట్టి వాళ్లు ఇప్పుడు సైలెంటైపోయారు. ఇప్పుడు వీళ్లిద్దరిలో ఎవరైనా శ్రీరెడ్డి ఇష్యూ మీద నోరు మెదిపే స్థితిలో ఉన్నారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు