‘స్పైడర్’ పోయినా ఇలా కలిసొచ్చింది

‘స్పైడర్’ పోయినా ఇలా కలిసొచ్చింది

​వేరే భాషల్లో.. వేరే రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకోవడానికి తెలుగు స్టార్ హీరోలు గత కొన్నేళ్లలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఒకసారి మార్కెట్ క్రియేట్ అయితే.. ఆ తర్వాత మంచి సినిమాలు పడితే అక్కడ పెద్ద రేంజికి వెళ్లిపోతారు హీరోలు. మలయాళంలో అల్లు అర్జున్ ఇలాగే స్టార్ హీరో అయిపోయాడు. ‘స్పైడర్’ ద్వారా తమిళంలో తనకు కూడా మంచి మార్కెట్ క్రియేటవుతుందని ఆశించాడు మహేష్ బాబు. ఐతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కానీ మహేష్ బాబు అక్కడి జనాలకు బాగానే నచ్చాడు. అతడి విషయంలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. పెద్ద మార్కెట్ అయితే క్రియేట్ కాలేదు మహేష్ అయితే అక్కడి జనాలకు బాగానే తెలిశాడు.

అది మహేష్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’కు బాగానే కలిసొచ్చింది. తమిళనాట అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ‘భరత్ అనే నేను’ రికార్డు నెలకొల్పబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి అక్కడ రూ.2 కోట్ల దాకా వసూళ్లు రావడం విశేషం. ‘బాహుబలి’ తెలుగు వెర్షన్ కూడా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. అక్కడ తమిళ వెర్షన్ కూడా విడుదల కావడంతో తెలుగు వెర్షన్ ఓ మోస్తరుగానే వసూళ్లు తెచ్చుకుంది. కోలీవుడ్లో నెలన్నర సమ్మె తర్వాత థియేటర్లు తెరుచుకోగా.. అదే సమయంలో ‘భరత్ అనే నేను’ రిలీజైంది. ఈ చిత్రానికి ఓ తమిళ సినిమా స్థాయిలో స్క్రీన్లు దక్కాయి.

ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా రిలీజ్ కానంత భారీగా ఇది విడుదలైంది. తమిళ జనాలు కూడా ఈ సినిమాను బాగానే చూసినట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ వెబ్ సైట్లన్నీ దీనికి రివ్యూలు కూడా ఇవ్వడం విశేషం. తొలి రోజే రూ.75 లక్షల వసూళ్లతో సంచలనం సృష్టించిందీ సినిమా. మొత్తానికి ‘స్పైడర్’ ఈ రకంగా అయినా మహేష్ కు కలిసి రావడం మంచి విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు