పవన్ నంబర్‌ వన్నా.. ఎలాగబ్బా?

పవన్ నంబర్‌ వన్నా.. ఎలాగబ్బా?

మెగాస్టార్ చిరంజీవి ఉన్నంత వరకే ‘నంబర్ వన్’ అనే మాట వినిపించేది. ఆయన రెండు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్లో మకుటం లేని మహారాజుగా కొనసాగాడు. కానీ ఆయన సినిమాలకు టాటా చెప్పేసి వెళ్లిపోయాక నంబర్ వన్ స్థానం ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత నిఖార్సయిన నంబర్ వన్ అంటూ ఎవ్వరూ లేరు. ఈ స్థానానికి ఇటు పవన్ కళ్యాణ్.. అటు మహేష్ బాబు సమాన స్థాయిలో పోటీనిస్తున్నారు కానీ.. వీరిలో ఏ ఒక్కరినో నంబర్ వన్ అని అనలేం. ఫాలోయింగ్.. మార్కెట్ పరంగా ఇద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోరు. ఐతే మెగా ఫ్యామిలీ మాత్రం కొత్తగా పవన్ ను నంబర్ వన్ హీరో.. నంబర్ వన్ హీరో అని కీర్తించేస్తుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మొన్న నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి తన తమ్ముడు నంబర్ వన్ హీరో అనేశాడు.

సినిమాల్లో కోట్లు కోట్లు వస్తుంటే వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాడన్నాడు. నిన్న అల్లు అర్జున్ సైతం పవన్ ను నంబర్ వన్ హీరో అని కీర్తించేశాడు. పవన్ త్యాగాల గురించి మాట్లాడాడు. కానీ పవన్ కు నంబర్ వన్ కిరీటం ఎవరిచ్చారు.. చిరంజీవిని అందరూ నంబర్ వన్ అని ఆమోదించినట్లుగా పవన్ ను ఆమోదిస్తారా అన్నది చూడాలి. అసలు చిరంజీవి లేనపుడు పవన్ కు ఆ స్థానం ఇస్తే సరే.. కానీ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చి సినిమాల్లో కొనసాగుతున్నపుడు పవన్ ను నం.1 అనడమే విడ్డూరం. నంబర్ వన్ అనిపించుకోవాలంటే నిలకడగా హిట్లివ్వాలి. ఇండస్ట్రీ హిట్లు కొట్టాలి. ఐతే పారితోషకం పరంగా పవనే నంబర్ వన్ అనడానికి వీల్లేదు. మహేష్ పవన్ కంటే తక్కువగా ఏమీ తీసుకోడు. ప్రతి సినిమాకూ మహేష్ పారితోషకం పెరుగుతుంటుంది.

ఆ మాటకొస్తే ‘జై లవకుశ’ సినిమాకు వాటా కింద వీళ్లకు దీటుగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ఎన్టీఆర్. అల్లు అర్జున్ కూడా పారితోషకంగా పరంగా వీరికి గట్టి పోటీనిచ్చే స్థితిలో ఉన్నాడు. ఇక విజయాల విషయానికొస్తే.. మిగతా అందరు హీరోలకంటే పేలవమైన రికార్డు పవన్ సొంతం. గత 15 ఏళ్లలో పవన్ కొట్టిన బ్లాక్ బస్టర్లు రెండే. అవే.. ‘గబ్బర్ సింగ్’.. ‘అత్తారింటికి దారేది’. ఇందులో రెండో సినిమా ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు