రెండు రోజుల్లో సమంత డబుల్ ధమాకా

రెండు రోజుల్లో సమంత డబుల్ ధమాకా

గత ఏడాది నాగచైతన్యతో సమంత ప్రేమాయణం ఖరారై.. పెళ్లికి సిద్ధపడే సమయంలో ఆమెకు సినిమాల మీద ధ్యాసే లేనట్లుగా కనిపించింది. కెరీర్లో ఎన్నడూ లేనంతగా ఆమె గ్యాప్ తీసుకుంది. పెళ్లి తర్వాత ఆమె ఇక సినిమాల్లో నటించదేమో అన్న సందేహాలు కూడా కలిగాయి ఒక దశలో. కానా ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ వరుసగా సినిమాలు ఒప్పుకుంది అక్కినేని వారి కోడలు. ఈ ఏడాది కొన్ని నెలల వ్యవధిలో బాక్సాఫీస్‌ను ముంచెత్తడానికి సామ్ రంగం సిద్ధం చేసుకుంది. ఆల్రెడీ ‘రంగస్థలం’తో భారీ విజయాన్నందుకుంది సమంత.

త్వరలోనే ఆమె మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఆ రెండు సినిమాలు రెండు రోజుల వ్యవధిలో విడుదల కానుండటం విశేషం. తెలుగులో సమంత నటించిన ఎపిక్ మూవీ ‘మహానటి’ మే 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో సామ్ జర్నలిస్ట్ మధురవాణిగా ప్రత్యేకమైన పాత్ర చేస్తోంది. ఇది విడుదలైన రెండు రోజులకే సమంత నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబుతురై’ రిలీజవుతుంది. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో రాబోతోంది. అటు ‘మహానటి’.. ఇటు ‘ఇరుంబుతురై’ రెండు
భాషల్లోనూ రిలీజవుతాయి.

మొత్తానికి ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు తమిళనాడులో సమంత సందడి చూడబోతున్నామన్నమాట. తమిళంలో సమంత నటించిన ఇంకో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘అరణ్యకాండం’ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూపర్ డీలక్స్’ అనే థ్రిల్లర్ మూవీతో పాటు శివకార్తికేయన్ సరసనా ఓ సినిమా చేస్తోంది. తెలుగులో ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు