కొరటాల మళ్లీ అన్యాయం చేశాడుగా..

కొరటాల మళ్లీ అన్యాయం చేశాడుగా..

రాజమౌళి తర్వాత ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కొరటాల. ఇప్పటికే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు కొట్టిన కొరటాల.. తాజాగా ‘భరత్ అనే నేను’తోనూ ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టరే అయ్యేలా ఉంది. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయ్యేలా ఉంది.

రాజమౌళి తర్వాత ఇలా వరుసగా నాలుగు సినిమాలతోనూ భారీ విజయాలందుకున్న దర్శకుడు కొరటాలే. అతడి సినిమాల్లో అన్ని వర్గాలకూ నచ్చే అంశాలుంటాయి. ఎంటర్టైన్మెంట్.. యాక్షన్ అన్నీ ఉండేలా చూసుకుంటాడు. హీరోయిజానికి ఢోకానే ఉండదు. ఐతే ఇవన్నీ ఓకే కానీ.. హీరోయిన్ల విషయంలో మాత్రం కొరటాలకు చిన్న చూపు అనే అభిప్రాయం ఉంది.

తొలి సినిమా ‘మిర్చి’లో రిచా గంగోపాధ్యాయ పాత్రకు ఏమంత ప్రాధాన్యం ఉండదు. అనుష్క పాత్ర కొంచెం బెటరే కానీ.. అదీ అంత కీలకమేం కాదు. ‘శ్రీమంతుడు’లో శ్రుతి హాసన్ పాత్ర పర్వాలేదు. ఐతే ‘జనగా గ్యారేజ్’లో ఒకరికి ఇద్దరు హీరోయిన్లున్నప్పటికీ వాళ్ల పాత్రలు తేలిపోయాయి. ఇద్దరికీ అన్యాయమే చేశాడు కొరటాల. ఆ విషయంలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ‘భరత్ అనే నేను’లో తప్పు దిద్దుకుంటాడేమో అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.

ఇందులో కియారా అద్వానీ పోషించిన వసుమతి పాత్ర నామమాత్రమే. ప్రి క్లైమాక్స్‌లో వచ్చే ఒక సీన్లో ఆ పాత్రకు ప్రయారిటీ ఇచ్చారు కానీ.. అందులో హీరోయిన్ ప్రమేయం అయతే ఏమీ ఉండదు. కియారా సినిమా మొత్తంలో చేయడానికి ఏమీ లేకపోయింది. ఆమె గ్లామర్ ను కూడా పెద్దగా ఉపయోగించుకున్నది లేదు.