మహేష్ అయితే ఇది.. లేకుంటే అది

మహేష్ అయితే ఇది.. లేకుంటే అది

కొడితే బ్లాక్ బస్టర్.. లేదంటే డిజాస్టర్ అన్నట్లే ఉంది మహేష్ బాబు పరిస్థితి. కొన్నేళ్లుగా వ్యవహారం ఇలాగే నడుస్తోంది. మహేష్ సినిమాలకు సంబంధించి యావరేజ్.. హిట్.. లాంటి మాటలేవీ వినిపించడం లేదు. చివరగా ‘బిజినెస్‌మేన్’ సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు మహేష్. ఆ తర్వాత వచ్చిన ‘1 నేనొక్కడినే’ పెద్ద డిజాస్టర్ అయింది. దాని తర్వాత వచ్చిన ‘ఆగడు’ ఫలితం కూడా అంతే. ఐతే ‘శ్రీమంతుడు’కు పాజిటివ్ టాక్ వచ్చింది. అది బ్లాక్ బస్టర్ అయింది. నాన్-బాహుబలి రికార్డుల్నే బద్దలు కొట్టేసింది. కానీ ఆ వెంటనే వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ మహేష్ కెరీర్లోనే కాదు..తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇక చివరగా వచ్చిన ‘స్పైడర్’ ఫలితం కూడా తెలిసిందే.

ఇందులో ‘1 నేనొక్కడినే’.. ‘స్పైడర్’ చెత్త సినిమాలేమీ కాదు. అయినా అవి దారుణ ఫలితాలందుకున్నాయి. ఐతే ఇప్పుడు ‘భరత్ అనే నేను’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేస్తోంది. దీని ఊపు చూస్తుంటే ‘రంగస్థలం’ బద్దలు కొట్టిన నాన్-బాహుబలి రికార్డును ఇది ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. మొత్తానికి కొడితే బ్లాక్ బస్టర్.. లేకుంటే డిజాస్టర్ అనే ఆనవాయితీని మహేష్ కొనసాగిస్తున్నాడు.

ఇలాంటి ట్రాక్ రికార్డున్న హీరోలు అరుదుగా ఉంటారనే చెప్పాలి. దాదాపుగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో సాగుతూ వచ్చాడు కొన్నేళ్లుగా. ఐతే ఇప్పుడతను సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. మహేష్ మాత్రం సినిమాల మీదే ఫోకస్ పెడుతున్నాడు. గత నాలుగేళ్లలో రెండు డిజాస్టర్ల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ అన్నట్లు సాగిపోయిన మహేష్.. ఇకపై ఎలా బండి నడిపిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు