ఎట్టకేలకు ఆ సినిమా పట్టాలెక్కనుంది

ఎట్టకేలకు ఆ సినిమా పట్టాలెక్కనుంది

ఊపిరి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ సినిమా అటు క్రిటికల్ అక్లైమ్ సంపాదించడంతో పాటు వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. ఇది రీమేక్ సినిమానే అయినప్పటికీ దర్శకుడిగా వంశీ పైడిపల్లి చాలామంచి పేరు సంపాదించాడు. దర్శకుడిగా అతడికి ప్రత్యేకమైన గుర్తింపు ఈ సినిమాతోనే వచ్చింది. ఆ గుర్తింపుతోనే అతను మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఐతే ఈ సినిమా ఓకే అయి రెండేళ్లవుతున్నా ఇంకా పట్టాలెక్కలేదు.

అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ చిత్రం గత ఏడాదే మొదలై.. ఈపాటికి విడుదలకు సిద్ధం కావాలి. కానీ ‘స్పైడర్’.. ‘భరత్ అనే నేను’ రెండు సినిమాల షూటింగూ ఆలస్యమైంది. దీంతో వంశీ సినిమా వాయిదా పడింది. ఎట్లకేలకు ‘భరత్ అనే నేను’ పని ముగించి ఫ్రీ అయిపోయాడు మహేష్.

‘భరత్ అనే నేను’ అదిరిపోయే టాక్‌తో మొదలై భారీ విజయం దిశగా పరుగులు పెడుతోంది. ఇలాంటి తరుణంలో తన సినిమా మొదలు కాబోతుండటం వంశీకి ఆనందాన్నిచ్చే విషయమే. ఈ చిత్ర స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ దీని కోసం ఆల్రెడీ ట్యూన్లు కూడా రెడీ చేసేశాడు. కొన్ని నెలల కిందటే దీనికి మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి.

దిల్ రాజు, అశ్వినీదత్ లాంటి అగ్ర నిర్మాతలిద్దరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముందు పీవీపీ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్న సినిమా ఇది. కానీ ఆయన చేతుల్లోంచి అనూహ్యంగా రాజు-దత్‌ల చేతుల్లోకి వచ్చేసిందీ ప్రాజెక్టు. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది. మే మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు