1 నేనొక్కడినే.. ఇంకో వెర్షన్ ఉందట

1 నేనొక్కడినే.. ఇంకో వెర్షన్ ఉందట

మహేష్ బాబు-సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘1 నేనొక్కడినే’ అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా అప్పట్లో దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఐతే నిజాకి ‘1’ అంత పెద్ద ఫ్లాప్ కావాల్సిన సినిమా ఏమీ కాదు. అందులో బలమైన కంటెంట్ ఉంటుంది. దాన్ని గొప్ప సినిమాగా అభివర్ణిస్తారు క్రిటిక్స్. కాకపోతే ఆ చిత్రాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. దీంతో సినిమా ఫలితం తేడా వచ్చేసింది. ఈ సినిమా విషయంలో తాను ఎప్పటికీ చింతిస్తూనే ఉంటానని అంటున్నాడు సుకుమార్. ఒక బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమా తన వల్లే ఫ్లాప్ అయిందేమో ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుందని సుకుమార్ చెప్పాడు.

‘1 నేనొక్కడినే’ విషయంలో తన వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయని సుకుమార్ చెప్పాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కొంచెం కఠినంగా వ్యవహరించానని.. నిడివి తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని సీన్లు తీసేస్తూ పోయానని.. చిన్న చిన్నవే అయినప్పటికీ వాటిని తీసేయడంతో కథ సంక్లిష్టంగా మారిందని.. ప్రేక్షకులకు సినిమా అర్థం కాకుండా పోవడానికి అది కూడా ఒక కారణమేమో అని సుకుమార్ చెప్పాడు. నిజానికి ‘1 నేనొక్కడినే’ కథ విషయంలో ఇంకో వెర్షన్ కూడా ఉందని.. దాని ప్రకారం ఇంటర్వెల్ వరకు హీరో డ్రామా ఆడి ఉంటాడని.. అతను ప్లే చేసిన విషయం విరామం దగ్గర తెలుస్తుందని.. ఆ వెర్షన్ పెట్టి ఉంటే హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేదని.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేవని.. ఐతే హీరోయిజం కంటే ఎమోషన్ ముఖ్యం అనే ఉద్దేశంతో తాను వేరే వెర్షన్లో సినిమా తీశానని సుకుమార్ చెప్పాడు. ఒకవేళ పాత వెర్షన్ కూడా చిత్రీకరించి రెంటినీ పోల్చుకుని ఉంటే అదే సినిమాలో పెట్టేవాడినేమో.. అప్పుడు సినిమా వేరే ఫలితాన్ని అందుకునేదేమో అని సుకుమార్ అభిప్రాయపడ్డాడు.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు