ఆ సినిమాలో అమీర్ ఎంత నీచుడంటే..

ఆ సినిమాలో అమీర్ ఎంత నీచుడంటే..

స్టార్ హీరోల ప్రభావం జనాలపై చాలా ఉంటుంది కాబట్టి చాలా వరకు ‘మంచి’ పాత్రల్నే ఎంచుకుంటూ ఉంటారు. తమ పాత్రల ద్వారా మంచి చెప్పడానికి.. స్ఫూర్తి నింపడానికే ప్రయత్నిస్తుంటారు. ఐతే అప్పుడుప్పుడూ వైవిధ్యం కోసం హీరోల క్యారెక్టర్లలోకి చెడు కూడా చేరుతుంటుంది. బాలీవుడ్లో అమీర్ ఖాన్ చాలా వరకు ఉదాత్తమైన.. ఇన్‌స్పైర్ చేసే పాత్రలే చేస్తుంటాడు. ఇందుకు ‘దంగల్’.. ‘పీకే’.. ‘3 ఇడియట్స్’ లాంటి సినిమాలు రుజువు. ఐతే మధ్యలో అతను దొంగ అవతారం ఎత్తి ‘ధూమ్-3’లో నటించాడు. ఇప్పుడు అమీర్ మరోసారి ఈ తరహా కంత్రీ పాత్రలో కనిపించబోతున్నాడు. అతను ప్రస్తుతం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తన గత సినిమాల్ని బట్టి తన పాత్రపై ఒక అంచనాతో రావొద్దని అమీర్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ‘దంగల్’లో తాను చేసిన పాత్రకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అతను చెప్పాడు. ఇందులో తాను దారుణమైన మనస్తత్వం ఉన్న దొంగ పాత్రలో కనిపించబోతున్నానని.. అవసరమైన తన తల్లిని కూడా అమ్మేసే నీచుడి పాత్ర ఇదని అమీర్ తెలిపాడు. ఐతే ఈ పాత్ర ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని.. జనాల్ని అలరిస్తుందని అమీర్ హామీ ఇచ్చాడు. ‘ధూమ్’ సిరీస్ రచయిత.. ‘ధూమ్-3’తో దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్షన్లో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొన్ని వందల ఏళ్ల కిందటి నేపథ్యంలో ఇద్దరు దొంగల కథను ఈ సినిమాలో చెప్పబోతున్నారట. ‘బాహుబలి’ రికార్డుల్ని బద్దలు కొట్టే సినిమా ఇది అవుతుందని బాలీవుడ్ జనాలు అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు