వర్మ డైరక్షన్లో మళ్ళీ ఫ్లాపే.. ఛ!!

వర్మ డైరక్షన్లో మళ్ళీ ఫ్లాపే.. ఛ!!

నా అభిమాన దర్శకుడు కం సంచలన దర్శకుడు కం ట్రెండ్ సెట్టర్ కం సెన్సేషన్ మేకర్ అయిన రాంగోపాల్ వర్మ గారికి.. అభిమానం ఆపుకోలేక.. ఈ మాటలు చెప్పకుండా ఉండలేక రాస్తున్న లేఖ..

'రాంగోపాల్ వర్మ గారూ.. మీరు ట్యాలెంటెడ్.. పైగా ఇంటెలిజెంట్. ఎన్ని విమర్శలు చేసినా.. రీసెంట్ గా అల్లు అరవింద్ గారు కూడా ఇదే మాట చెప్పారు. చాలా సంవత్సరాలుగా మీ నుంచి సరైన సినిమా ఒక్కటి కూడా రావడం లేదనే భావన నాతో పాటు.. నాలాంటి ఎంతో మంది అభిమానుల్లో ఉంది. మీ నుంచి ఎప్పటికైనా ఒక్క సినిమా సరైనది పడకపోతుందా.. అని చాలా మంది అభిమానులం ఎదురుచూస్తూనే ఉన్నాం'

'ఈ హిట్టు ఆశలో మేం ఉండగా.. మీరు ఐస్ క్రీమ్ అంటూ ఏదో చూపిస్తే సరే అనుకున్నాం. వంగవీటి అంటూ వాస్తవాలను వదిలేసి మీకు నచ్చినట్లుగా తీసుకుంటే కానీలే అని వదిలేశాం. ఒక్క రక్త చరిత్ర మొదటి భాగం మినహాయిస్తే.. గత కొన్నేళ్లలో మీనుంచి ఇలాంటి అనుక్షణంలు  చాలానే వచ్చాయి. సత్య2.. ఐస్ క్రీమ్2.. 365 డేస్.. వీరప్పన్.. అటాక్.. సర్కార్3.. ఇలా అనేక చిత్ర రాజాలు ఉన్నాయి. సరే ఎన్ని సార్లు దెబ్బ వేసినా.. ఏదో ఒక రోజు బౌన్స్ బ్యాక్ అవుతారని.. మీ డైరెక్షన్ తో మళ్లీ శివ రోజుల నాటి వర్మను ఏదో ఒక రోజు మాకు చూపించేస్తారని.. అంతో ఇంతో ఆశ పెట్టుకుని ఆత్రంగా ఎదురుచూస్తూనే ఉన్నాం.'

'కానీ సినిమాల్లో మీ డైరెక్షన్ తో సత్తా చాటలేకపోతున్న మీరు.. ఇప్పుడు రియల్ లైఫ్ లో డైరెక్షన్ కి ట్రై చేశారు. కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాడుతున్న శ్రీరెడ్డికి ఓ అమూల్యమైన సలహా ఇచ్చి.. ఎలా చేస్తే పోరాటం నుంచి ఉద్యమ రూపంలోకి చేరుకోవచ్చో మీకు తోచినట్లుగా డైరెక్షన్ చేశారు. కానీ మీ సినిమాల మాదిరిగానే ఇది కూడా వికటించి.. ఇప్పుడు జనాలు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడ్డం లేదు. మరోవైపు ఇప్పటివరకూ శ్రీరెడ్డి పై ఉన్న సానుభూతి కాస్తా.. వ్యతిరేకత కింద టర్న్ అయిపోయింది.'

'శ్రీరెడ్డిని అందరూ అసహ్యించుకుని.. ఇండస్ట్రీ అంతా ఆమె చేసిన ఆరోపణలను ఖండించే వరకు వచ్చేసింది. మీరు అనమని చెప్పిన ఒకే ఒక్క మాటతో పాపం.. ఆ అమ్మాయి తన పరువును రోడ్డున పెట్టుకుని సాధించిన మొత్తం.. మూసీనదిలో ముంచేశారు. సినిమాలలో ఎలాగూ ఫెయిల్ అవుతూనే ఉంటారని తేలిపోగా.. ఇప్పుడు మీ డైరెక్షన్ లో మరో ఫెయిల్యూర్ చూడాల్సి రావడంతో.. అభిమానులం మరోసారి హర్ట్ అవాల్సి వచ్చింది'..

'వర్మ డైరెక్షన్ లో మళ్లీ ఫ్లాపే.. ఛా' అనుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఇలాంటి చెత్త డైరెక్షన్లు కాకుండా.. మాలాంటి పిచ్చి అభిమానులను మెప్పించే ఏదో ఒక సినిమా తీయండి చాలు.. రీల్ లైఫ్ లో మీరు ఇంకెన్నో సాధిస్తారని ఇంకా మేం ఆశతోనే ఉన్నాం'

ఇట్లు
మీ నుంచి ఏదో ఒక మంచి సినిమా వస్తుందనే ఆశ చావని ఓ అభిమాని
కృష్ణకుమార్ వర్మ

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English