అల్లు వారి కెరీర్లో తొలిసారి ఇదేనట..

అల్లు వారి కెరీర్లో తొలిసారి ఇదేనట..

అల్లు అరవింద్ ప్రొడక్షన్లో సినిమా తీద్దామని ఎవరైనా దర్శకుడు గీతా ఆర్ట్స్ కాంపౌండ్లోకి అడుగుపెడితే.. అతను సినిమా తీసి తిరిగొచ్చేసరికి చాలా గొప్ప మార్పు కనిపిస్తుందని అంటారు. ఆ దర్శకుడు పట్టుకెళ్లే స్క్రిప్టు కూడా చివరికి సినిమాగా తెరకెక్కేసరికి చాలా మారిపోతుందని కూడా అంటారు. ఆ కాంపౌండ్లో జరిగేంత మథనం మరెక్కడా జరగదని.. అల్లుతో పాటు చుట్టూ ఉన్న టీం కూడా స్క్రిప్టు విషయంలో అనేక మార్పులు చేర్పులు చేస్తుందని అంటారు. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా స్క్రిప్టు విషయంలో అల్లు వారి చేయి పడాల్సిందే అని చెబుతారు. ఐతే ఫస్ట్ టైం అరవింద్ జోక్యం ఏమాత్రం లేకుండా ఆయన బేనర్ నుంచి ఒక సినిమా తెరకెక్కిందట. అదే ‘టాక్సీవాలా’.

ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవిందే చెప్పాడు.
రాహుల్ సంకృత్యన్ ‘టాక్సీవాలా’ అనే ఒక విభిన్నమైన కథతో తమ దగ్గరికి వచ్చాడని.. ఇలాంటి కథలో తాము వేలు పెడితే ఆ సినిమా మరో రకంగా తయారయ్యేదని.. కానీ అలా కాకూడదనే ఉద్దేశంతో అసలేమాత్రం జోక్యం చేసుకోకుండా దూరంగా ఉన్నామని.. కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టామని అరవింద్ చెప్పాడు. ఇలా తన బేనర్లో ఇంకతుముందు ఏ సినిమాకూ జరగలేదని కూడా అరవింద్ చెప్పాడు. తాము ఆ కథలో వేలు పెట్టకపోవడమే తాము దర్శకుడికి చేసిన అతి పెద్ద సాయమని.. రాహుల్-విజయ్ కలిసి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారని.. సినిమా చాలా బాగా వచ్చిందని విన్నానని.. త్వరలో చూస్తానని అరవింద్ అన్నాడు.ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయడానికి ఎవరైనా ముందుకు రావచ్చని.. వారికి తాము అండగా నిలుస్తామని అరవింద్ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు