ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ను కేసీఆర్ అవ‌మానించారా?

తెలంగాణ గురుకులాల ద‌శ‌ను మార్చ‌డం ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అనూహ్య రీతిలో త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. ప‌ద‌వికి గుడ్ బై చెప్పేసిన అనంత‌రం ఆయ‌న పాలిటిక్స్‌లోకి ఎంట‌ర్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఇప్పుడ‌ప్పుడే తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఆయ‌న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించిన‌ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం అమలు- పర్యవేక్షణ-నిర్వహణతో పాటుగా విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై తొలి అవగాహన సదస్సును ఈ నెల 26 వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగనుంనది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం దాకా జరగనున్న ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వారు పాల్గొన‌డంతో పాటుగా ద‌ళ‌ఙ‌త సామాజిక‌వ‌ర్గానికి చెందిన మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు పాల్గొంటారు.

ఈ అవ‌గాహ‌న స‌ద‌స్సుకు ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆహ్వానం అందించింది. అయితే, ఇందులో ఆస‌క్తిక‌రంగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేరు లేదు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. ‘దళిత బంధు’ చర్చలకు నాకు ఆహ్వానం లేదు అని తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ప్ర‌వీణ్ కుమార్ బహుజనులు కేంద్రంగా కొత్త పార్టీ రావాలన్నారు.

తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదు, సంపద అంతా ఒక్క శాతం మంది దగ్గర ఉందని, 99 శాతం మందికి తాయీలాలతో నడిపిస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్లు చూస్తుంటే ద‌ళితుల సంక్షేమం విష‌యంలో, తాజాగా ప్ర‌వేశ‌పెడుతున్న ద‌ళిత బంధు ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఖాయ‌మ‌ని ప‌లువ‌రు జోస్యం చెప్తున్నారు.