‘బాహుబలి’కి అది.. ‘రంగస్థలం’కు ఇది

‘బాహుబలి’కి అది.. ‘రంగస్థలం’కు ఇది

కోట్లు ఖర్చు పెట్టి.. ఎంతో శ్రమకు ఓర్చి ఒక సెట్ వేశాక.. దాన్ని తీసేయాలంటే చాలా బాధగా ఉంటుంది. ఈ విషయంలో చాలామంది ఆర్ట్ డైరెక్టర్లు ఉద్వేగానికి గురవుతుంటారు. కానీ తప్పదు కాబట్టి సెట్టింగ్ తొలగించాల్సిందే. కానీ ‘బాహుబలి’ కోసం వేసిన మహిష్మతి రాజ్య సెట్టింగ్‌ను తొలగించాల్సిన అవసరం లేకపోయింది. రామోజీ ఫిలిం సిటీలో దాన్నే ఒక సందర్శన ప్రాంతంగా మార్చేశారు. దానికి టికెట్ కూడా పెట్టి అభిమానుల్ని అనుమతిస్తున్నారు. ఎప్పటికీ ఆ సెట్టింగ్స్ అలాగే నిలిచిపోనున్నాయి. ఈ తరహాలో కాకపోయినా.. ‘రంగస్థలం’ కోసం వేసిన విలేజ్ సెట్ కూడా అలాగే కొనసాగబోతోంది. తమ చిత్ర బృందం ఎంతో శ్రమకు ఓర్చి 50 రోజుల పాటు పని చేసి విలేజ్ సెట్ రూపొందించామని.. దాన్ని తొలగించడం లేదని సుకుమార్ వెల్లడించడం లేదు.

‘రంగస్థలం’ సెట్ వేరే సినిమాలకు కూడా ఉపయోగపడేలా ఉందని.. చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని అలాగే వేరే సినిమాలకు వాడుకుంటున్నారని.. ఈ సెట్ తీసేయాల్సిన అవసరం రాకపోవడం చాలా సంతోషాన్నిస్తోందని సుకుమార్ తెలిపాడు. తన కెరీర్లో ‘రంగస్థలం’ సెట్ ప్రత్యేకంగా నిలిచిపోతుందని సుకుమార్ చెప్పాడు. గతంలో మంచు మనోజ్ సినిమా ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ కోసం వేసిన బిల్డింగ్ సెట్ ను కూడా తీసేయాల్సిన అవసరం లేకపోయింది. దాన్ని అలాగే కొనసాగించి తర్వాత వేరే సినిమాల షూటింగుల కోసం ఉపయోగించుకున్నారు. ‘రంగస్థలం’ సెట్‌ కూడా అలాగే కొనసాగబోతోందన్నమాట. ఇది సెట్టింగ్ అనే ఆలోచనే రానివ్వకుండా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ అద్భుత నైపుణ్యం చూపించాడు. ఈ నైపుణ్యానికి జాతీయ అవార్డు కూడా రావొచ్చని చిరు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు