మెహబూబా.. నిజమా.. గిమ్మిక్కా?

మెహబూబా.. నిజమా.. గిమ్మిక్కా?

నిజమే.. ‘మెహబూబా’ టీజర్ జనాల దృష్టిని ఆకర్షించింది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్ గత సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా అనిపిస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. కానీ ఈ చిత్ర బృందం దీని గురించి చెబుతున్న మాటలే అతిశయోక్తిలా అనిపిస్తున్నాయి. మొన్న ‘మెహబూబా’ టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరూ అతిగానే మాట్లాడారు.

తన తండ్రి పూరిని తాను రీలాంచ్ చేస్తున్నానని.. ఆయనేంటో ఈ సినిమాతో తెలుస్తుందని హీరో ఆకాశ్ అన్నాడు. సినిమా ఎడిటింగ్ టైంలో చూస్తే కళ్లు తిరిగాయని ఒక టెక్నీషియన్ చెప్పాడు. ఇక ఛార్మి గురించి చెప్పాలా? ఎప్పట్లాగే పూరి భజన చేసింది.

మిగతా వాళ్ల మాటలేమో కానీ.. దిల్ రాజు సైతం ఈ సినిమాను తెగ పొగిడేశాడు. సినిమా చూసి ఇది కదా పూరి అంటే అనిపించిందన్నాడు. సినిమా అద్భుతంగా వచ్చిందన్నాడు. ఐతే పూరి తనయుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమా కాబట్టి దీనికి హైప్ తేవాలని అందరూ అతిగా చెబుతున్నారేమో అని జనాలకు సందేహాలు కలుగుతున్నాయి. పూరి ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ చాలా చాలా కష్టం. ఈసారైనా మంచి సినిమా తీస్తాడేమో అని చూసి చూసి పూరి అభిమానులు విసుగెత్తిపోయి ఆయన మీద పూర్తిగా నమ్మకం కోల్పోయారు.

ఇలాంటి ప్రతికూల సమయంలో పూరి తన కొడుకును హీరోగా పరిచయం చేయడానికి డిసైడయ్యాడు. పూరి సంగతేమో కానీ.. ఆకాశ్‌కు ఈ సినిమా చాలా కీలకం. ఈ నేపథ్యంలో పూరి భిన్నమైన కథతో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. కానీ ఈ చిత్రానికి మొదట్నుంచి హైప్ లేదు. ఐతే టీజర్.. ట్రైలర్ రిలీజయ్యాక పరిస్థితి మెరుగైంది. ఇంతలో దిల్ రాజును లైన్లోకి తేవడం.. ఆయన బేనర్లో సినిమా రిలీజ్ చేయడానికి డీల్ కుదుర్చుకోవడం ద్వారా ఇంకాస్త క్రేజ్ తీసుకురాగలిగారు. ఇది పూరి వైపు పుష్ చేస్తే జరిగిన డీల్ అంటున్నారు. రిలీజ్ ముంగిట ఈ సినిమానే చిత్ర బృందం పొగిడేస్తున్న తీరు చూస్తుంటే.. ఇది నిజమా.. లేక ప్రచార గిమ్మిక్కా అన్న సందేహాలు కలుగుతున్నాయి. చూద్దాం ఏప్రిల్ 11న ‘మెహబూబా’లో అంత ప్రత్యేకత ఏముందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు