‘భరత్ అనే నేను’కు బంపరాఫర్

‘భరత్ అనే నేను’కు బంపరాఫర్

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల మార్కెట్ బాగా విస్తరించింది. ఇంతకుముందు కేవలం తెలుగు రాష్ట్రాల వసూళ్లే లెక్కలో ఉండేవి. మిగతా ఏరియాల కలెక్షన్లు నామమాత్రంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వేరే రాష్ట్రాల్లో కూడా మన సినిమాలకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. కర్ణాటకలో మన స్టార్ల సినిమాలకు రూ.10 కోట్ల దాకా రేటు పలికే పరిస్థితి ఉంది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలుగు సినిమాలకు మంచి వసూళ్లు అందించే రాష్ట్రం తమిళనాడు. చెన్నై సహా పలు నగరాల్లో మన సినిమాలు పెద్ద ఎత్తునే రిలీజవుతుంటాయి. ఐతే గత నెల నుంచి తమిళ నిర్మాతలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 8 నుంచి తెలుగు సినిమాల ప్రదర్శన కూడా ఆపేయడానికి తెలుగు నిర్మాతల మండలి అంగీకరించింది. దీంతో అప్పటిదాకా బాగా ఆడుతున్న ‘రంగస్థలం’ ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. నితిన్ సినిమా ‘చల్ మోహన్ రంగ’.. నాని మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’లకు తమిళనాట ఆదాయం నిల్ అయిపోయింది.

ఐతే తర్వాత రాబోయే భారీ సినిమా ‘భరత్ అనే నేను’కు మాత్రం బంపరాఫర్ తగిలింది. సరిగ్గా ఈ చిత్ర విడుదలకు ముందు అక్కడ సమ్మెకు తెరపడింది. ఈ వీకెండ్ నుంచే కొత్త సినిమాల ప్రదర్శన పున:ప్రారంభం కానుంది. ఐతే ఇంత తక్కువ వ్యవధిలో కొత్త తమిళ సినిమాలేవీ ఈ వారాంతంలో విడుదల కాకపోవచ్చు. ఇది ‘భరత్ అనే నేను’కు కలిసొచ్చే విషయమే. ‘స్పైడర్’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయినప్పటికీ మహేష్ తమిళ జనాలకు చేరువయ్యాడు. ఈ నేపథ్యంలో ‘భరత్ అనే నేను’ మీద తెలుగు జనాలే కాక.. తమిళ ప్రేక్షకులూ ఆసక్తి చూపించే అవకాశముంది. మామూలుగానే మహేష్ సినిమాలో చెన్నై లాంటి నగరాల్లో పెద్ద ఎత్తున రిలీజవుతుంటాయి. ఇప్పుడు ఇంకా పెద్ద స్థాయిలో ‘భరత్ అనే నేను’ను రిలీజ్ చేసే అవకాశముంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే తమిళనాట తెలుగు సినిమాల కలెక్షన్ల రికార్డులు బద్దలైపోతాయేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English