హామీలు ఇచ్చేముందు ఆలోచించాల్సిందే

ఎన్నికలు వస్తున్నాయంటేనే రాజకీయ పార్టీలు పూనకం వచ్చినట్లు హామీలవర్షం కురిపించేస్తుంటారు. నోటికేదొస్తే ఆ హామీనిచ్చేసి పబ్బం గడుపుకోవచ్చని అనుకునే పార్టీల అధినేతలే ఎక్కువమంది. అధినేతలిచ్చిన హామీలను జనాలు నమ్మి ఓట్లేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలు అమలవుతాయి, మరికొన్నింటిని నీరుగార్చేస్తారు. అసలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పక్కన పడేసే సందర్భాలు కూడా ఉంటాయి. హామీల అమలు విషయంలో ఇకనుండి అలా ఉండేందుకు లేదు.

తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీ అమలు కాకపోవటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల ఇంటి అద్దెలను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇచ్చిన హామీ అమలు కాలేదు. దనిపై కొందరు కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇచ్చిన హామీని అమల్లోకి తేవాల్సిన బాధ్యత సీఎంపైనే ఉంటుందని స్పష్టంగా చెప్పింది.

అధికారంలోకి రావటానికి లేదా వచ్చిన తర్వాత సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సీఎంపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంగా తేల్చిచెప్పింది. ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు స్వాగతించాల్సిందే. ఎందుకంటే అధికారంలోకి రావటమే టార్గెట్ గా పార్టీల అధినేతలు ఆచరణ సాధ్యంకాని హామీలను ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

రాష్ట్ర ఆర్ధికపరిస్ధితులతో సంబంధం లేకుండా ఉచిత హామీలు, రాష్ట్రపరిధిలో లేని రిజర్వేషన్ల అమలు లాంటి హామీలను ఇచ్చేస్తున్న విషయం జనాలు చూసిందే. ఏపిలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, తెలంగాణాలో కేసీయార్, తమిళనాడులో పార్టీలు ఇలాంటి ఎన్నో హమీలను ఇచ్చేశారు. జనాలు కూడా ఇలాంటి ఉచిత ప్రకటనలకు అలవాటుపడిపోయారు.

ఇలాంటి ఉదాహరణలనే ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. తమ తీర్పు ఢిల్లీకి మాత్రమే వర్తించదని ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే తీర్పు వర్తిస్తుందని స్పష్టంగా చెప్పింది. మరి మన నేతలు హామీలను ఇచ్చేముందు ఇకనుండి జాగ్రత్తగా ఉంటారా ?