'మహానటి’లో ఆ సీన్లు చాలా స్పెషల్

'మహానటి’లో ఆ సీన్లు చాలా స్పెషల్

ఈ ఏడాది తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘మహానటి’ కూడా ఉంటుంది. ఇందులో ఏ స్టార్ హీరో లేడు కానీ.. అయినప్పటికీ దీనిపై అమితాసక్తి నెలకొంది. మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందు నుంచి ప్రత్యేకంగానే కనిపిస్తోంది. దీని ప్ర్రోమోలు జనాల్ని బాగా ఆకర్షించాయి. తాజాగా రిలీజైన టీజర్ బాగా ఇంప్రెస్ చేసింది. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ టీజర్‌కు రెండు రోజుల్లోనే 3 మిలియన్ వ్యూస్ రావడాన్ని బట్టి దీనిపై జనాల్లో ఏ స్థాయిలో ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. భారీ ఖర్చుతో సినిమాను నిర్మించింది. ఈ సినిమా కోసం ఏడాది పాటు వందల మంది టెక్నీషియన్లు పని చేశారు. సావిత్రి సినిమాల్లో నటించినప్పటి రోజుల్ని తెరమీదికి తీసుకొచ్చేందుకు శ్రమించారు. ఆ కష్టమంతా సినిమాలో కనిపిస్తుందని.. జనాలు సినిమా చూసి అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారని చిత్ర బృందం చెబుతోంది. టీజర్ చూస్తే అది నిజమే అనిపించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో స్పెషల్ న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో కొన్ని సన్నివేశాల్ని ఫిల్మ్‌తో షూట్ చేశారట. ఇప్పుడు మొత్తం డిజిటల్ విధానంలో సినిమాలు తీస్తున్నారు. కానీ గతంలో ఫిల్మ్‌తోనే సినిమా తీసేవాళ్లు. అప్పటి రోజుల్ని వాస్తవికంగా చూపించాలంటే ఫిల్మ్‌తో తీస్తేనే సహజంగా ఉంటుందని భావించి దర్శకుడు నాగ్ అశ్విన్.. పాత స్టయిల్లో కొన్ని సీన్లు తీశాడట. ఫిల్మ్ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడెక్కడో తిరిగి దాన్ని సంపాదించారట. దాంతో తీసిన సీన్లు ప్రేక్షకుల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్తాయని.. ఆ సీన్లు ప్రత్యేకంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English