మహేష్ వీరంగానికి స్టేజ్ సెట్టయింది

మహేష్ వీరంగానికి స్టేజ్ సెట్టయింది

అసలే సమ్మర్ సీజన్. పైగా పోటీ లేదు. ముందు వారంలో వచ్చిన సినిమా చతికిలపడింది. తర్వాతి వారం చెప్పుకోదగ్గ సినిమా లేదు. ముందు వారాల్లో వచ్చిన పెద్ద సినిమా కథ ముగింపు దశకు వచ్చేసింది. ఒక భారీ సినిమా థియేటర్లలోకి దిగడానికి ఇంతకంటే సానుకూల వాతావరణం ఇంకేముంటుంది? మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ విషయంలో ఇదే జరుగుతోంది.

భారీ అంచనాలున్న ఈ సినిమా విడుదలకు ముందు గ్రౌండ్ క్లియర్ అయిపోయింది. ‘రంగస్థలం’ సినిమా ఇప్పటికీ బాగానే ఆడుతోంది కానీ.. ఇప్పుడొస్తున్న వసూళ్లు పోటీ లేకపోవడం వల్ల బోనస్‌గా వస్తున్నవే. ఇప్పటికే సినిమాలు చూసే వాళ్లందరూ దీనిపై ఒక లుక్కేసేశారు. వేరే ఆప్షన్లు లేక ఇంకా దీన్నే చూస్తున్నారు.

ఇక గత వారం విడుదలైన నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ అంచనాల్ని అందుకోవడడంలో విఫలమైంది. గత మూడేళ్లలో నాని సినిమా దేనికీ లేని పరిస్థితి దీని విషయంలో కనిపిస్తోంది. ఈ సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీనికంటే ముందు వారం వచ్చిన ‘చల్ మోహన్ రంగ’ వీకెండ్ అవ్వగానే సోయిలో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రేక్షకుల చూపంతా ‘భరత్ అనే నేను’ మీదే ఉంది.

శుక్రవారం ఈ సినిమా రిలీజ్ నాటికి పాత సినిమాలన్నీ ఒకేసారి లేచిపోతాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. తర్వాతి వారం రావాల్సిన ‘కాలా’ వాయిదా పడిపోయింది. మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ వచ్చినా దాని ప్రభావం మహేష్ మూవీ మీద ఏమీ ఉండదు. మొత్తానికి మహేష్ బాక్సాఫీస్ వీరంగానికి స్టేజ్ పక్కాగా సెట్టయింది. మరి ‘భరత్ అనే నేను’ ఏం చేస్తుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు