సోషల్ మీడియాలోకి రానంటే రానంటోంది

 సోషల్ మీడియాలోకి రానంటే రానంటోంది

ఈ రోజుల్లో సోషల్ మీడియాకు దూరంగా ఉండే సెలబ్రెటీలు అరుదు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు చెప్పడానికి.. తమ విశేషాల్ని అభిమానులతో పంచుకోవడానికి.. సినిమాల్ని, తాము ప్రచారం చేసే బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు సెలబ్రెటీలు. దీన్ని పెద్ద ఆదాయ మార్గంగా మలుచుకున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఐతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం సోషల్ మీడియా జోలికే వెళ్లదు.

ఆమెకు ట్విట్టర్లో కానీ.. ఫేస్ బుక్‌లో కానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ అకౌంట్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆమె టెక్నాలజీ విషయంలో వీక్ ఏమో అనుకుంటారు. కానీ సోషల్ మీడియా పట్ల ఉన్న వ్యతిరేకత వల్లే తాను అందులోకి అడుగుపెట్టలేదని అంటోంది కంగనా.

ఇప్పుడే కాదు.. ఎప్పటికీ తాను సోషల్ మీడియాలోకి రానని ఆమె తెగేసి చెప్పేసింది. తన తరఫున సోషల్ మీడియా అకౌంట్లను మేనేజ్ చేయడానికి కొన్ని సంస్థలు కూడా ముందుకొచ్చాయని.. కానీ అలా చేయడం ఇష్టం లేక తాను ఊరుకున్నానని ఆమె చెప్పింది. సోషల్ మీడియా అంటేనే టైంను తినేసే వ్యవహారమని.. అలాగే అందులో ఉంటే నిజాయితీగా ఉండలేమని.. ప్రధానంగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ఇవే కారణాలని ఆమె చెప్పింది.

ఏదో ఉండాలి కాబట్టి సోషల్ మీడియాలో ఉండటం తనకు ఇష్టం ఉండదని.. అదే సమయంలో సోషల్ మీడియాలో నిజాయితీగా ఉంటే లేని పోని తలనొప్పులు తలెత్తుతాయని.. తన మనస్తత్వానికి అది సూటవ్వదు కాబట్టే తాను దానికి దూరంగా ఉంటున్నానని ఆమె స్పష్టం చేసింది. తన ప్రమేయం లేకుండా వేరే వాళ్లు తన అకౌంట్ నడపడం కూడా తనకు ఇష్టం ఉండదని.. కాబట్టి మున్ముందు కూడా తాను సోషల్ మీడియాలోకి వచ్చే అవకాశాలు లేవని కంగనా స్పష్టం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు